mt_logo

తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరైడ్ రహిత నీళ్ళు..

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్న వాటర్ గ్రిడ్ పైలాన్ కు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత మంచినీళ్ళు అందుతాయని, రక్షిత మంచినీరు మానవహక్కుగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

చౌటుప్పల్ లో పైలాన్ ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, కృష్ణానది ఈ జిల్లానుండే పారుతున్నా ఇక్కడి ప్రజలు ఇన్నాళ్ళుగా కనీసం తాగునీటి సౌకర్యానికి నోచుకోలేదన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సుమారు 2 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారని, ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా గత పాలకులు చిన్నచూపు చూశారని, రాష్ట్రం ఏర్పడ్డ ఆరునెలల్లోనే సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించి రోడ్లను అద్దంలా తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారని కేటీఆర్ చెప్పారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్లోరిన్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ 45 వేల కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారని, మునుగోడు నియోజకవర్గం నుండే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *