mt_logo

తెలంగాణలో తొలి పరిశ్రమకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

విమాన పరికరాల తయారీ పరిశ్రమను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో నెలకొల్పుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ కానుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నట్లు, ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి హైదరాబాద్ వేదికగా మారిందని అన్నారు. సింగిల్ విండో విభాగం సీఎంవోలోనే ఉంటుందని, పారిశ్రామికవేత్తలు ఆఫీసులచుట్టూ తిరగాల్సిన పని లేదని, పరిశ్రమల అనుమతులకోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

టాటా, రుయాగ్ సంస్థల సంయుక్త ప్రాజెక్టుగా ఈ పరిశ్రమ రూపకల్పన జరగనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో ప్రధాన విభాగంతో పాటు రెక్కల తయారీని ప్రారంభించనున్నారు. రెండవ దశలో మొత్తం విమానం తయారు కానుంది. మరోవైపు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ తో సమావేశమై హైదరాబాద్ పోలీసు వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై సీఎం కు వారు వివరించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో డీజీపీ అనురాగ్ శర్మ, జంటనగరాల కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేకాట క్లబ్ లను వెంటనే మూయించి వేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధానిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, గురుకుల్ ట్రస్ట్ భూములను స్వాధీనం చేసుకోవాలని, ఆ భూముల్లో కట్టిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భూకబ్జాలు, అక్రమ కట్టడాలపై హైకోర్టు తీర్పునకు అనుకూలంగా నడుచుకోవాలని, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల ట్రస్ట్ భూములు మొత్తం 627 ఎకరాలు ఉన్నాయని, ఈ భూముల్లో 70 ఎకరాలు అయ్యప్ప సొసైటీకి కేటాయించారని జీహెచ్ఎంసీ అధికారులు సీఎం కు వివరించారు. అంగుళం భూమి అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదని, అవసరమైతే పోలీసుల సాయాన్ని తీసుకొని కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు భూముల స్వాధీనానికి సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *