ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దగ్గరికి వచ్చే ప్రజలు, సందర్శకుల కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ఎస్ఐబీ(స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్) కార్యాలయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అక్కడున్న ఆంధ్రా గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని మరోచోటికి మార్చుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సీమాంధ్ర గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు భవనాన్ని ఖాళీ చేస్తూ భవనంలో విధ్వంసం సృష్టించారు.
అక్కడున్న కిటికీలు, గ్రిల్స్, వాటికున్న అద్దాలను పూర్తిగా పెకిలించి తీసుకెళ్ళారు. ఏసీ కనెక్షన్లను ఇష్టం వచ్చినట్లు కట్ చేసి మళ్ళీ పనికిరాకుండా చేశారు. ఫ్యాన్లు, లైట్లు, స్విచ్ బోర్డులను, మెయిన్ ఫ్యూజ్ తో పాటు మీటర్ ను సైతం ఎత్తుకెళ్ళారు. బాత్రూముల్లోని నల్లా కనెక్షన్లు, ట్యాప్, వెస్ట్రన్ టైప్ లావెట్రీ, సాధారణ మరుగుదొడ్లను సైతం వదిలిపెట్టలేదు. దీన్నిబట్టి చూస్తే అర్ధమవుతుంది తెలంగాణపై సీమాంధ్ర అధికారుల కడుపుమంట ఏవిధంగా ఉందో! క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలపై ఎంతటి విషాన్ని కక్కుతున్నారో ఈ సంఘటన చూస్తే తెలుస్తుందని తెలంగాణావాదులు మండిపడుతున్నారు.
వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగేవరకూ ఇక్కడ ఎస్ఐబీ కార్యకలాపాలు సాగిస్తుండేది. విభజన అనంతరం వెనకాల ఉన్న మరో భవంతిలోకి అది మారిపోయింది. ఖాళీ చేసిన అధికారులు కనీసం బల్బును కూడా ముట్టుకోకుండా హుందాతనాన్ని ప్రదర్శించారు. విభజన తర్వాత ఈ భవనాన్ని సీమాంధ్ర గ్రేహౌండ్స్ దళాలకు ఆ భవంతిని కేటాయించారు. రెండునెలల క్రితమే ఇక్కడికి వచ్చిన ఈ విభాగం భవనంలో అన్ని సౌకర్యాలూ ఉండటంతో ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. సీఎం గ్రీవెన్స్ కార్యాలయం అని తెలిసికూడా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం సరైంది కాదని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.