mt_logo

తెలంగాణలో బీజేపీని దెబ్బతీయాలనేదే బాబు లక్ష్యం – కేటీఆర్

మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే ధైర్యం లేకనే బలవంతంగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్రను పోషిస్తున్నారని పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో సమైక్యవాదిగా ముద్రపడి దోషిగా మిగిలిన చంద్రబాబు తన పాపాన్ని బీజేపీకి అంటగడుతున్నారని, తెలంగాణలో బీజేపీని దెబ్బతీయాలన్నదే ఆయన లక్ష్యమని అన్నారు.

మెదక్ జిల్లా గజ్వేల్ లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ టీడీపీ, బీజేపీ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎన్ని నోట్ల కట్టలు పంపినా జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని, తెలంగాణ అభ్యర్థులను ఆంధ్రా నాయకులు ఎంపిక చేసే దౌర్భాగ్యస్థితి తెలంగాణ ప్రజలకు రావడం దురదృష్టకరమని అన్నారు.

ఎంతోమంది ప్రాణత్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని, తమ వల్లే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి చెప్పుకోవడం వింతగా ఉందని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వందరోజుల పాలనపై రాష్ట్ర ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని, టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని లోక్ సభ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. ప్రచారంలో కేటీఆర్ తో పాటు మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు సుధాకర్ రెడ్డి, రాములు నాయక్, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *