mt_logo

తెలంగాణ వ్యతిరేకులని ద్రోహులనే అంటం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవారు, విభజనను వ్యతిరేకిస్తున్నవారు ఖచ్చితంగా తెలంగాణ ద్రోహులేనని టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. ఇదే మాటను ఒక్కసారి కాదు లక్ష సార్లు అంటానని స్పష్టం చేసారు. ఇందులో ఎంతమాత్రం అనుమానం లేదని అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తెలంగాణకు మద్ధతు ఇస్తున్నాయని, అందుకే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపానని గుర్తుచేశారు.

నిన్న తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

‘నేను సీమాంధ్రులంతా ద్రోహులని అనలే, ద్రోహం చేసిన సీమాంధ్ర నాయకులని అన్న. మరి వారిని ద్రోహులనకుంటే ఏం అంటం? తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి, ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడుతున్న చంద్రబాబుది ద్రోహం కాకపోతే ఏంది? విజయమ్మ పరకాల ఉప ఎన్నికలప్పుడు వరంగల్ కు వచ్చి చిలుక పలుకులు పలికారు. ఇప్పుడేమో హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ద్రోహమనే అంటారు. సీమాంధ్ర ఉద్యమంలో ఒక్కొక్క రోజు నన్ను, సోనియా గాంధీని ఎన్ని తిట్లు తిడుతున్నారు? పశు ప్రవృత్తితో, హీనంగా, నీచంగా, అతి దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఎమ్మెల్ల్యే ఆనం వివేకానంద రెడ్డి తెలంగాణ వాళ్ళంతా రాక్షసులే … వారిది రాక్షస సంతతి అన్నాడు, అప్పుడు ఈ నారాయణ, దత్తాత్రేయ ఎందుకు స్పందించలేదు? అని కేసీఆర్ ప్రశ్నించారు.

పయ్యావుల కేశవ్ రాష్ట్ర విభజన జరిగితే మానవ బాంబునై ఆత్మాహుతి దాడులు చేస్తం అన్నడు. అప్పుడెందుకు వీరు స్పందించలేదు ? ఖలిస్తాన్ ఉసురు తగిలి ఇందిరాగాంధీ, తమిళుల ఉసురు తగిలి రాజీవ్ గాంధీ కనుమరుగయారని, అదే రీతిలో తెలుగు ప్రజల ఉసురు తగిలి సోనియా గాంధీ కూడా కనుమరుగవుతదని కేశవ్ అన్నారు. అప్పుడేమైంది వారి సంస్కారం? సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆత్మ హత్యలుండవు..ఇక హత్యలే అని అశోక్ బాబు అన్నడు ఇదా సంస్కారం? తెలంగాణ ఏర్పడితే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తం అని టీ జీ వెంకటేష్ అన్నడు. ఉస్మానియా విద్యార్ధులను తాలిబన్లు అని ఎన్ని సార్లు అన్నరు? ఇవన్నీ రోజూ పేపర్లలో టీవీలల్లో చూస్తలేరా? ఈ వన్ సైడ్ లవ్వేంది?

కాంగ్రెస్ హై కమాండ్, ప్రధాన మంత్రి వెంటనే తెలంగాణ ప్రక్రియను ముగించేందుకు చర్యలు చేపట్టాలని, ఆలస్యం చేస్తే వైషమ్యాలు పెరుగుతాయని కేసీఆర్ అన్నారు.

తొడలు కొట్టడం, జబ్బలు చరచడం, మెడకాయలు కోస్తామనడం..ఇవన్నీ కలిసుండేవారి లక్షణాలేనా.? అని ప్రశ్నించారు. ద్రోహంచేశారు కాబట్టే ద్రోహులన్నామని, నోటి కాడి కూడు ఎత్తగొట్టారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *