ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున మూడు గ్రామాలు పోటీ పడుతుండగా అందులో ఒక గ్రామం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. యూఎన్‌డబ్ల్యూటీవో బెస్ట్ టూరిజం విలేజ్ పోటీ ఎంట్రీకి భూదాన్‌పోచంపల్లితో పాటు భారత దేశం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని లద్‌పురాఖాస్ గ్రామం, మేఘాలయ రాష్ట్రంలోని కాంగ్‌థాన్ గ్రామాలను కేంద్రం సిఫార్సు చేసింది. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా వివిధ దేశాల్లోని గ్రామీణ పర్యాటకాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పడమే కాకుండా..ఆ గ్రామాల్లోని ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎంపిక చేసి పంపిన భూదాన్ పోచపంల్లి గ్రామాన్ని వంద దేశాలకుపైగా పర్యాటకులు సందర్శించి.. ఇక్కడ గ్రామీణ నేపథ్యాన్ని, చరిత్రను, అభివృద్ది శైలిని అధ్యయనం చేశారు.
భూదాన్ పోచంపల్లి గ్రామం చేనేత కళాకారుల ప్రతిభకు చిరునామా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టె చీరలు నేసిన ఘనత ఉంది. ముఖ్యంగా అరబ్‌దేశాలకు చిన్న చిన్న అలంకరణ సామగ్రిని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. భూదానోద్యమానికి అంకురార్పన ఈ గ్రామంలోనే జరిగింది. 1951లో వినోబాభావే పోచంపల్లికి వచ్చారు. ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి వెనుకబడిన వర్గాలకు 100 ఎకరాల భూమి దానం చేశారు. ఎంతో మంది విదేశీయులు ఇక్కడ సాంస్కృతిక జీవన నేపథ్యాన్ని అధ్యాయనం చేయడానికి వస్తుంటారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఇక్కడ నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా ఉపాధి కోర్సులు నిర్వహిస్తోంది.