mt_logo

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రం-జానారెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానంపై మూజువాణి ఓటుకు, తెలంగాణ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మిగతా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి నుండి వచ్చిన బిల్లుపై అసెంబ్లీలో కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, తీర్మానం, నోటీస్ లాంటివేవీ బిల్లుతో సంబంధం లేనివని మరోసారి స్పష్టం చేశారు. ఇరుప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికే సీమాంధ్ర నేతలు ఈవిధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రులకు కావాల్సిన వాటిపై పార్లమెంటులో చెప్పి సాధించుకోవాలని సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం ఫిబ్రవరి నెలలోనే ఏర్పడుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని, ముఖ్యమంత్రి మాటతప్పడంపై ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు. మూజువాణి ఓటు అంటే వాయిస్ ఓటు అని ఆంగ్లంలో వాడుకలో ఉందని, ఈ ప్రక్రియ ద్వారా సభ్యులు అవునని లేదా కాదని ఒక్క నిమిషంలోనే నోటిమాట ద్వారా తెలపడం. స్పీకర్ వేగంగా వీటిని పరిశీలించి సభ ఆమోదించిందా? లేదా? అని నిర్ణయిస్తారు. సభలో ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తం కాని అంశాల్లో మాత్రమే ఈ రకమైన ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వానికి సాధారణంగా మెజార్టీ సభ్యులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ బిల్లుల విషయంలో ఈ ఓటింగ్ ను పాటిస్తారు. అత్యంత కీలకమైన రాష్ట్ర విభజన విషయంలో మూజువాణి ఓటు చెల్లదని, ఏ దేశంలోనూ ఈ పద్ధతి పాటించరని జానారెడ్డి వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సీఎం ఇచ్చిన తీర్మానంపై మూజువాణి ఓటు ప్రక్రియ నాలుగు గోడల మధ్యే ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *