రాష్ట్రంలో కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నందున, అందివచ్చిన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకొనేలా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా వలన అన్ని రంగాల్లో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనప్పటికీ.. భారత్ వంటి దేశాల్లో కొత్త రంగాల్లో నూతన అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోడానికి, పారదర్శక విధానాలతో ప్రపంచంలోని అనేక కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు.
‘తెలంగాణ అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, సంస్కరణలు రాష్ట్రానికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. ఈ గుర్తింపు వల్ల కరోనా వంటి మహా సంక్షోభ కాలంలో కూడా రాష్ట్రానికి అనేక పెట్టుబడులు రాగలిగాయి. ఈ కరోనా సంక్షోభం ముగుస్తున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి. నూతన పెట్టుబడుల వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీలతో విరివిగా సమావేశాలు జరపాలి. అవసరమైతే ఆయా దేశాల్లోని పారిశ్రామిక వర్గాలను తెలంగాణకు ఆహ్వానించి ఇక్కడి సానుకూల పరిస్థితులను, అవకాశాలను వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వచ్చే ఏడాదికి సంబంధించి పారిశ్రామిక వర్గాల పెట్టుబడులపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటినుండే కార్యాచరణ రూపొందించాలి’ అని మంత్రి కేటీఆర్ తెలియజేసారు.