తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగున్నదని జమ్ము, కశ్మీర్‌కు చెందిన బ్లాక్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్లు (బీడీసీ) ప్రశంసించారు. హరితహారం, పల్లెప్రకృతి వనాలు బాగున్నాయని, పంచాయతీల అభివృద్ధికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు అద్భుతమని కితాబిచ్చారు. ఎన్‌ఐఆర్డీలో నిర్వహిస్తున్న శిక్షణకు హాజరైన ముగ్గురు బ్లాక్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్లు, ఇతర అధికారులతో కూడిన 40 మంది సభ్యులు మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చేరుకున్నారు.
ముందుగా వీరు డంపింగ్ యార్డును సందర్శించారు. అక్కడ తయారవుతున్న వర్మీకంపోస్టు గురించి సర్పంచ్ పల్లె నరేశ్‌గౌడ్, ఎంపీపీ శ్రీదేవి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో మొక్కల పెంపకం, టీహెచ్‌ఆర్ పల్లె ప్రకృతివనాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని అనుసరించి చేపడుతున్న విధులు, కేటాయిస్తున్న నిధులు, పనుల పురోగతిని ఎన్‌ఐఆర్డీ కోఆర్డినేటర్ కడారి రాజేశ్వర్ వారికి వివరించారు. తెలంగాణలో పరిశీలించిన అంశాలను జమ్ము, కశ్మీర్ పరిధిలోని బీడీసీలోఅమలు చేసేందుకు ఉపయోగపడతాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. పల్లెల అభివృద్ధికి తెలంగాణ సర్కారు అనేక నిధులు కేటాయిస్తున్నదని, రోడ్ల పక్కన ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నదన్నారు.