తెలంగాణ నిరసనోద్యమమైంది! ఇందిరాపార్క్ వద్ద రణన్నినాదం చేసింది! రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు మొదలు.. సకల తెలంగాణ సంఘాలు.. సంస్థలు.. ఉద్యోగులు.. కవులు.. కళాకారులు.. మహిళలు.. విద్యార్థులు.. ఆదివారం ఇందిరాపార్క్‌వద్దకు పోటెత్తారు! అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. అధిగమించి.. వేల సంఖ్యలో తండోపతండాలుగా కదిలి వచ్చిన జనం.. జై తెలంగాణ నినాదాలతో ధర్నా చౌక్‌ను మార్మోగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని 36 గంటల సమరదీక్షపూనారు! ఆజాద్, షిండేల ప్రకటనల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను సోమవారం నాటి ముగింపు సమావేశంలో ప్రకటించనున్నారు. ముగింపు కార్యక్రమానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కూడా హాజరు కానున్నారు.
అనుమతి ఇవ్వడంలో చివరి నిమిషం వరకూ కుట్రలు చేసిన ప్రభుత్వం.. తెలంగాణ ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తితో వెనుకడుగు వేసి.. ఎట్టకేలకు అనుమతి మంజూరు చేయడంతో సమర దీక్ష ఆదివారం మధ్యాహ్నం మొదలైంది. అప్పటికే నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి దీక్ష వేదిక వద్దకు బయల్దేరిన తెలంగాణ ఉద్యమశ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. చివరకు అనుమతి లభించిన తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్ల నుంచి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఇందిరాపార్క్‌కు చేరుకున్నారు. సమరదీక్షను ప్రారంభించిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం.. తెలంగాణ విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు రాష్ట్రంలో సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నడూ మాటకు కట్టుబడి ఉండలేదన్న కోదండరాం.. ఢిల్లీలో 28లోపు ప్రకటన వస్తుందని ఆశించలేదని స్పష్టం చేశారు. ఆజాద్ క్యాలెండర్‌కు, షిండే క్యాలెండర్‌కు పొంతనలేదని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఇప్పుడు ఇవ్వడం లేదని ఆజాద్, షిండే చేసిన ప్రకటనలు సిగ్గుమాలినవని అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్.. సీమాంధ్ర గులాం అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తున్నదని అన్నారు. ఏళ్ల తరబడి సంప్రదింపులు జరిగిన తర్వాత కూడా ఇంకా ఎంతకాలం సంప్రదింపులు జరుపుతారని ఆయన ప్రశ్నించారు. ఆజాద్, షిండే ప్రకటనల తర్వాతనైనా తెలంగాణ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ఉద్యమద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. ఇకపై తమ టార్గెట్ టీ మంత్రులేనని స్పష్టం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ ధూంధాం, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పాటలతో రాత్రంతా హోరెత్తించారు ‘జై బోలో తెలంగాణ, రణగర్జనల జడివాన’ ‘అమరులకు జోహార్, వీరులకు జోహార్’ వంటి పాటలతో ఉత్తేజపరిచారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]