ప్రజా వాగ్గేయకారుడు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ గా నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ముఖ్యపాత్ర పోషించాలని, జూబ్లీహిల్స్ లోని సాంస్కృతిక శాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారధి కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, హరితహారంలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం సూచించారు.
ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి రసమయి శుక్రవారం సీఎంను సచివాలయంలో కలిశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రసమయి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రసమయి మీడియాతో మాట్లాడుతూ ఒక కళాకారుడిగా ఎమ్మెల్యేను అయినందుకు సంతోషంగా ఉందని, అదే సమయంలో తెలంగాణ సాంస్కృతిక సారధికి చైర్మన్ గా నియమించడం అంటే ఒక కూలిబిడ్డకు దక్కిన గౌరవంగా భావిస్తునట్లు అన్నారు. తనపై సీఎం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.