mt_logo

తెలంగాణ పునర్నిర్మాణం కెసిఆర్ తోనే సాధ్యం : కవిత

గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో జరిగిన ఇందూరు నగర జయభేరి సభలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని ప్రసంగించారు. వేల సంఖ్యలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్న ఈ సభకు టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జి బస్వా లక్ష్మీనర్సయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ స్వామిగౌడ్, రసమయి బాలకిషన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు  బాల్క సుమన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 14 ఏళ్లుగా కేసీఆర్ రాక్షసులతో కొట్లాడి తెలంగాణ తెచ్చారని, సబ్బండవర్ణాలకు టీఆర్ఎస్ పార్టీనే అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగే మొదటి ఎన్నికల్లో తెలంగాణకు అడ్డం పడ్డవాళ్లకు ఓటేస్తారా? లేక కష్టపడి తెలంగాణ సాధించిన వాళ్లకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. జిల్లాలో డీ శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి వంటి పెద్దమనుషులు ఉన్నాకూడా రోడ్లు నడవడానికి వీలులేకుండా ఉన్నాయని, నగరంలో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య ఉందని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అధికారం ఇచ్చినా నిజామాబాద్ జిల్లా సమస్యలు తీరలేదని, కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ తోనే ఇంటింటికి తాగునీరు, తారురోడ్లు వస్తాయని స్పష్టం చేశారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పోరాడి గెలిస్తే కాంగ్రెస్ నేతలు వెన్ను చూపారని విమర్శించారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ లక్షా డెబ్బై ఐదువేల మంది ఆంధ్రా వాళ్ళు అక్రమంగా తెలంగాణ ఉద్యోగాల్లో ఉన్నారని, వాళ్ళంతా ఇక్కడినుండి వెళ్లాల్సిందేనని, ఆప్షన్లు లేవని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *