mt_logo

తెలంగాణ గోస కేసీఆర్ కే తెలుసు- హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పాటుబడిన కేసీఆర్ కే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని, తెలంగాణ గోస ఆయనకే బాగా తెలుసని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో 1144రోజులుగా జరుగుతున్న తెలంగాణ రిలే నిరాహారదీక్షను విరమింపచేసిన అనంతరం హరీష్ రావు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ఉద్యమాన్ని నంగునూరు మండలం కోనాయిపల్లినుండి ప్రారంభించారని, ఇక్కడి ప్రజలంతా దీవెనలు అందించి పంపారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పల్లెపల్లెలో జనాన్ని కదిలించి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ కీలక పాత్ర వహించి  బంగారు తెలంగాణ ఇస్తారని హామీ ఇచ్చారు. తర్వాత పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా గజ్వేల్ లో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడారు. సీమాంధ్ర పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఎన్నో కష్టాలు అనుభవించామని, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ను ఖమ్మం జైల్లో, నన్ను మెదక్ జైల్లో పెట్టారని హరీష్ రావు గుర్తుచేశారు. వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎం లుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థులను, ఉద్యోగులను లాఠీ దెబ్బలు కొట్టి జైలులో ఉంచి కేసులు పెట్టారని, తెలంగాణ సాధించడంలో కడుపు మాడ్చుకుని ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందని, ఏనాడూ ఉద్యమం చేయని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈరోజు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమే అని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడితోనే పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో కలిపేవిధంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గిరిజనులకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తుందని విమర్శించారు. త్వరలో వచ్చే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని విజయపథంలో నడిపిస్తేనే బంగారు తెలంగాణ సాధించుకోవచ్చని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *