—- రమేశ్ హజారి
తెలంగాణ లో మెయిన్ స్ట్రీం రాజకీయాలను అర్ధం చేసుకోవడం తద్వారా తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణాన్ని మొదలు పెట్టడం,అందుకు కొన్నాల్ల పాటు యథాతదంగా ప్రస్తుతమున్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక మద్దతునివ్వడం, అనే కోణంలో నా ఆలోచనలను మీముందుంచుతున్న..మిత్రులారా.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత జరుగుతున్న పరిణామాలను చూస్తున్నప్పుడు ఎందుకిట్ల జరుగుతుందనే ప్రశ్నలు మన అందరి మనసులను తొలుస్తున్న నేపధ్యం. తెలంగాణ ప్రజలు స్వంత రాష్ర్టంలో కూడా సీమాంధ్ర కుట్ర రాజకీయాల బారిన పడాల్నా యింకా వాటిపై ఉద్యమించాల్సిన అవసరమేందనే బాధ .వాటిని మీతో పంచుకునే ప్రయత్నమే యిది.
సీమాంధ్ర రాజకీయ పెట్టుబడీదారి మీడియా కుట్రదారి వర్గాలు తెలంగాణ ప్రజల మనుసుల మీద తాట్ పోలీసింగును యధావిధిగా కొనసాగిస్తూ విధానపరమైన కుట్రపూరిత ఎత్తుగడలు వేస్తునే వున్నరు. మెదటినుంచి తెలంగాణ ప్రజలను ఎట్లనయితే గిచ్చి మనుసుమీద కొట్టకుంట రెచ్చగొట్టుకుంట కోపం తెప్పించుకుంట బజార్ల బడేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నరో యిప్పుడూ అదే కుట్రలను కొనసాగిస్తున్నరు. మన వనరులను ఇదివరకు ఎట్లయితే దోసుక పోయిండ్రో తెలంగాన వచ్చినంక గూడ అయే కతల బడుతుండ్రు.
సీమాంధ్ర రాజకీయ కుటిల నీతి ఈనాడు’ తీరుగ స్లో పాయిజన్.మన తీర్గ అటో యిటో తేల్చుకుందామన్నట్టుండవు. అందుకే వాల్ల గురించి వాల్ల రాజకీయాల గురించి ఆలోచించాల్సివచ్చినపుడు మనసుమీదికి కాకుండా మెదడు మీదికి తెచ్చుకుందాం.తాడును తంతే వాని తల మీద తందాం…తన్నినం గూడ.అట్ల తన్నెపట్కె నే తెలంగాన తెచ్చుకున్నం.
అందుకు కేసీయారు గారి ఎత్తుగడలే ప్రధమ పాత్ర వహించినవనే విషయాన్ని మనం మరోసారి గుర్తుకుచేసుకుందాం. తెలంగాణలో ప్రజా ఉద్యమాలు ప్రజలను చైతన్యం చేయడంలో కీలకంగా పనిచేసినవి.అయితే తెలంగాణను దోపిడీ చేస్తున్న ఆంధ్రా మెయిన్ స్ర్టీమ్ దొంగ కోటరీని అంతే ధీటుగా రాజ్యాంగ పరిధిలో ఎదుర్కోవడానికి కేసీఆర్ అనేక రాజకీయ ఎత్తుగడలు సీమాంధ్ర రాజకీయ మూలాలను పెకిలించినయి.అది చరిత్ర నిరూపించింది గూడా.అందుకు కాంగ్రేస్ బీజేపీ సహా మిగిలిన అన్ని పార్టీలు కూడా సహకరించడం చారిత్రాత్మకం.
ఉద్యమకాలంలో ఒక్కతాటిమీద నిలబడ్డ అన్ని పార్టీలు సంఘాలు సంస్థలు యిప్పుడు ఎందుకని ఐక్యం కాలేక పోతున్నయి.అందుకు కారణమేంది.టీయారెస్ పార్టీ ప్రభుత్వం లో ఉన్నందుకా…కేసీయార్ ‘‘ఒంటెద్దు’’ పోకడలా..మేము సహకరిస్తే ఆ క్రెడిటంతా టీఆర్ఎస్కు పోతదని ప్రతిపక్షల ఆలోచనా.. తెలంగాణ కల సాకారమయినంక ఎందుకని రాజకీయ శక్తులు పునరేకీకరణం కాలేక పోతున్నయి. ఇవన్నీమనముందున్న ప్రస్తుత ప్రశ్నలు. సగటు తెలంగాణ వాదిని కలవర పెడుతున్న ఆందోళనకూడా ఇదే.
అయితే ఉద్యమకాలంలో టీయారెస్ పార్టీకి, ప్రభుత్వాన్ని నడుపుతున్న టీయారెస్కు రూపంలో సారంలో తేడా వచ్చే అవకాశముంటది. విమర్శలు ప్రతివిమర్శల నడుమ ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గా కేసీయార్ ను అర్థం చేసుకోవడంలో మనకు గూడా మరికొంత క్లారిటీ రావాల్సిన అవసరమున్నది.
కేసీయార్ అట్ల చేస్తే బాగుండు ఇట్ల చేస్తే బాగుండు అని చాలామందిమి కోరుకుంటున్నమాట వాస్తవం.ఆయిన మీద మనసు పెంచుకోని అనుకున్నట్లు జరుగడంలో ఏమాత్రం తేడా వచ్చినా బంగపడుతున్నం.తాను కోరుకున్న వ్యక్తి ఏమాత్రం తేడాగా వ్యవహరించినా సగటు ప్రేమికుడు ఓర్చుకోలేడు.అదే మాదిరి కేసీఆర్ పట్ల తెలంగాణ వాదుల అంతర్గత విమర్శలను కూడా మనం అర్ధం చేసుకోవాల్సి వుంటది.అయితే ఎంత మంచి బంగారమయినా యింత యిత్తడి కలువంది వస్తువు గాదట.అట్లనే కేసీఆర్ మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా ఆయన చుట్టూ వున్న రాజకీయ పరిస్తితుల ప్రభావం ఆయన మీద ఉంటది. మనకు ఇష్టమయిన విధానంలో ఆయన కార్యాచరణ ఉండి వుండక పోవచ్చు.తాను సర్వకాల సర్వావస్తలయందు అమలు చేయాలనుకున్నా చేయలేని కొన్ని విషయాలను ప్రజలకు బహిరంగంగ విడమరిచి చెప్పలేకపోవచ్చు. ఉద్యమ సమయంలో కేసీఆర్ మీద అంతర్గతంగా తెలంగాణ వాదులు చేసిన విమర్శలు కావచ్చు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తాను ప్రవేశపెట్టిన కొన్ని పథకాల విషయంలో కేసీఆర్ అనుసరించిన విధానాలు కావచ్చు,వీటన్నిటిని మనం రాజకీయ పరిణితితో బాహ్య రాజకీయ పరిస్థితులను పోల్చుకొని చూడాల్సిన అంశాలే తప్ప పరస్పర విరుద్ద అంశాలుగా చూడలేం.
కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వాలు సదురుకుందానికే చాన సమయం పడుతది.అందుల కొత్త రాష్ర్టం కొత్త ప్రభుత్వం కొత్త కొత్త అనుభవం.మరోపక్కకు గుంటనక్కలోతిగే సీమాంధ్ర రాజకీయాలు.అయినా అన్నిటిని అధిగమించుకుంటు వీటినడుమ ‘అదిరిందయ్యా చంద్రం’ అని కేసీఆర్ అనిపించుకున్నమాట వాస్తవం. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఈ మాత్రం నూక్కొస్తున్నడంటే నిజంగా గొప్పవిషయం.
‘తెలంగాణోనికి ప్రత్యేక రాష్ర్టమా…మీకో ప్రభుత్వం..దాన్ని మీరు నడుపుడు’’ ….ఇదీ ఆంధ్ర మీడియా రాజకీయ నాయకులు చేసిన యెతేష్కం.దీన్ని తిప్పికొట్టగలిగినమా లేదా.తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేయడం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటది.ఆకలితోనైనా చస్తం గని ఆత్మగౌరవాన్ని వదులుకోం’’ అనే నినాదాన్ని అమలు పరిచేక్రమంలో ఈ నాలుగునెల్లు గడిచినయి.సీమాంధ్ర మదం పైన తెలంగాణ జండా అన్ని రకాలుగా ఎగరడం ప్రారంభమైంది. రైతుల ఆత్మహత్యలు తప్ప తెలంగాణ నాలుగు నెల్ల పాలనలో అన్ని సవ్యంగనే నడుస్తున్నయి. రైతుల మరణాలు సీమాంధ్ర పాలకుల పాపాల పర్యావసానమే. తెలంగాణకు బొగ్గు వనరులున్నా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు లను ఆంధ్రలో పెట్టిరి.ఎటుజూసిన ఆదెరువులేని తెలంగాణకు కరెంటు కష్టాలు ముందు వూహించినయే. ఎన్ని ఎత్తులేసినా నాలుగు నెల్లల్ల ఏం చేయగలం ప్రక్రుతి సహకరించకుంటే.అదే జరిగింది. టీ తెలుగుదేశం నాయకులు ఈ విషయాన్ని మరిచిపోవద్దు.చంద్రబాబు హయాంలో కరెంటు ఎంత సప్లయి చేసినా కాలం కలిసిరాక ఒక్క ఏడాదిలనే మూడువేల మంది కి పైగా రైతులు చచ్చిపోయిన చరిత్ర వున్నది. దానికి అనేక కారణాలతో పాటు ప్రక్రుతి సహకరిచక పోవడం కూడా కారణమే.అది పూడ్చలేని నష్టమే.ఈ విషయాలను గణాంకాలతో సహా మాట్లాడుకోవాల్సి ఉన్నది. దానికి కేసీఆర్ ను మాత్రమే బాధ్యున్ని చేయడం సమంజసం కాదంటాను. కేసీఆర్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాల్సిన సమయం ఇంకా రాలేదు. కనీసం ఓ సంవత్సరమైనా వేచి చూడకుండా విమర్శలు చేయడం సరికాదు. నిర్మాణాత్మక సూచనలు వేరు రాజకీయ విమర్శ వేరుగా ఉండడమే సరికాదు.
అయితే ప్రస్తుతం మనం మన ప్రభుత్వాన్ని ఎందుకు ఓన్ చేసుకోవాలె…అవసరమేంది…అనే విషయాన్నిపరిశీలిస్తే
కేసీఆర్ ను మొదటి నుంచి తెలంగాణ బుద్ది జీవులు మావో మార్్క్స స్థాయిలో ఊహించుకోవడం జరుగుతున్నది. అట్ల బంగపడడానికి కారణం మన గతకాలపు కమ్యునిస్టు సెంట్రిక్ రాజకీయ అవగాహనే కారణం కావచ్చు. ప్రజాస్వామ్యం బూటకమని పార్లమెంటు అసెంబ్లీలు మనయి కావని అసలు ప్రభుత్వమంటేనే వర్గ శత్రువనే కార్యాచరణతో తెలంగాణ ప్రజలు పరాయి పాలకుల మీద పోరాటాలు చేసిన చరిత్ర. అట్లా పోరాటాలే జీవితాలుగా గడిపిన మన మైండు సెట్లు అట్ల తయారయినయి. తెలంగాణ రాష్ర్టం వచ్చినా అదే రాజకీయ ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తున్నము. యిగ యిప్పుడు మన ఆలోచనను మార్చుకోవాలి. మన ప్రభుత్వాన్ని మనం ఓన్ చేసుకోవాల్సిన చారిత్రక నేపధ్యమిది. మనకు రాజు అయినా నిజాంను ఓన్ చేసుకోక పోవడం మనమే నిజాం ప్రభుత్వాన్ని శత్రువుగా ఈనాటికి భావిస్తుండడం వలన సీమాంధ్ర పాలకులకు మనమే ఆయుధం అందించినట్లు అయిందనే సంగతిని మనం గ్రహించాలె. ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలు తన ప్రాంతానికి చెందిన మంచి చెడులను అన్నీటిని ఓన్ చేసుకోవడం ద్వారా మాత్రమే బలోపేతమయితవి. అట్లనే రాష్ర్టం కూడా. తమిళనాడు ను అందుకు ఉదాహరణగా తీసుకోవాలె. మెయిన్ స్ట్రీం రాజకీయాలను అర్ధం చేసుకోవాలన్నా తెలంగాణలో రాజకీయ సుస్తిరత రావాలన్నా ఇది తప్పనిసరి, ఏపార్టీ అధికారంలో వున్నా సరే. ప్రస్తుత అధికార పార్టీ పని విధానం సరిగాలేదనుకుంటే తెలంగాణ నాయకత్వంలనే ప్రత్యామ్న్యాయ రాజకీయ వేదికలు తయారుకావాలె తప్ప తెలంగాణను వ్యతిరేకించిన సీమాంధ్ర పార్టీల కు అనుబంధంగా కొనసాగడం లాంగ్ టర్మలో తెలంగాణకు పెను ముప్పు. సీమాంధ్ర రాజకీయాల ముందల అట్ల కార్యాచరణతో నడువకుంటే కుదురనే కుదురదు.
పాలక వర్గాల ప్రతి నిర్ణయం, కార్యాచరణ వెనుక స్వప్రయోజనం దాగుంటుందనే అనుమానం తప్పేం కాదు.అయితే అది వాచడాగ్ లెక్కన వుండాలె గని అనుమానపు మొగుడు లెక్కకాదు. సందర్భానుసారంగా పనితీరును గాడిలో పెట్టేందుకు సోయిని కలిగి ఉండాలె. శత్రు విభేదానికి మిత్ర వైరుధ్యానికి తేడా తెలిస్తే మనుసు తేలికయితది. యిండ్ల వ్యక్తిగతంగా కేసీయార్తో వున్న విభేదాలను కాని ఆయన వల్ల నష్టపోయామనో లేదా లబ్ది పొందలేక పోతున్నామనే స్వీయ మనస్తత్వానికి గురికాకుండా నిగ్రహించుకోవాల్సిన విశయాన్ని మేధావి వర్గం మర్సిపోవద్దు. వాటిని ఆయనకున్న పరిమితులుగా మాత్రమే అర్ధం చేసుకుంటే విషయం అర్దమయితది.అంతకు మించి కూడా కొన్ని అంశాలుండొచ్చు అవి విదానపరమైన నిర్నయాలయి కూడా ఉండవచ్చు. ఉదాహరణకు అగ్రకులాలకు పెద్దపీట దళితునికి ముఖ్యమంత్రి, తెలంగాణ సాంస్క్రతిక విధానం, తదితర అంశాలు. వీటిని దీర్ఘకాలికంగా పరిష్కరించుకోవాల్సిందే..కాని వాటిని ముందట బెట్టకోని కేసీఆర్ను విమర్శించుకుంట కూసోలేం. మనసుల బెట్టుకోని అన్నింటిని ఒకే గాటన కట్టలేం.ఇప్పుడు తెలంగాణ ప్రజలముందున్నది..సీమాంధ్రుల పొత్తుల సంసారాన్ని వదిలించుకొనుడెట్ల పునర్నిర్మాణమెట్ల అనేవి రెండు ప్రముఖంగా ఎదురుంగున్న సమస్యలు. వీటి చుట్టు మనం ఆలోచించాలె.
ఉద్యమకాలం నుంచి గూడా ఈ సంఘర్షణల పరం పర యిట్లా కొనసాగుతూనే ఉన్నది.అయితే ప్రజల కోణం భిన్నంగా ఉంటూనే వస్తున్నది. తెలంగాణ సాధనలో కేసీయార్ పార్లమెంటరీ పంధా నాయకత్వం పై పూర్తి విశ్వాసాన్ని ప్రజలు చూపిస్తూ వస్తనే ఉన్నరు.వచ్చిన్రు కూడా.
యింకో ముఖ్యవిషయం మనం గమనించాల్సిందేమంటే తెలంగాణ బుద్ది జీవుల’ సమాజానికి… మెయిన్ స్ర్టీం రాజకీయ సమాజానికి నడుమ నడుస్తున్న సంఘర్షణ.మెయినిస్ర్టీమ్ రాజకీయ పార్టీలనాయకత్వాన్ని వర్గ ద్రుష్టితో చూడడం.వారిని వోన్ చేసుకోక పోవడం.వారిని శత్రు వర్గంలో జమకట్టడమనే విధానం యింకా కొనసాగుతున్నది తెలంగాణల. దానికి ప్రస్తుత పరిస్తితికి అద్దం పడుతున్నది.ఆంధ్రబాబుల కుట్రలు అర్థమవుతున్నా గూడ తెలంగాణ ప్రభుత్వాన్ని వెనకేసుక రాలేని పరిస్తితిలో తెలంగాణ ప్రజా సంఘాలు బుద్దిజీవులున్నారు. డైరక్టు గా టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే తమ మీద ప్రభుత్వ తొత్తు’ అనే ముద్ర యేడ పడుతదోననే అపరాధ భావన చాలా మంది మేధావి వర్గ పెద్దలను పట్టి పీడిస్తున్నది. గుడ్డిదో కుంటిదో మన శరీరాన్ని మనం ప్రేమించకుంటే మంది ఎట్ల ప్రేమిస్తరు.. మన ప్రభుత్వాన్ని మనం వోన్ చేసుకోక పోతే తెలంగాణ బాగుపడడం కష్టం (ప్రేమించడం తరువాత) అది యే పార్టీ ప్రభుత్వమైనా కావచ్చు.
ఉద్యమ కాలంలో సీమాంధ్ర కుట్రదారీ వర్గం యిటువంటి వాటిని అలుసుగ తీసుకోని మన నడుమ చిచ్చు పెట్ట జూసింది.అయితే వారి కుట్రలను బ్రమ్మాండంగా తిప్పి కొట్టినం.ఇప్పటికీ అదే స్పూర్తిని కొనసాగించాలె.కొనసాగిస్తం అందుల తేడా యేం లేదు.అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలేంటివి వాటిని ఎట్ల అర్ధం చేసుకుందాం,
‘‘ కేసీఆర్ ఇంకా గూడ సెంటిమెంటును అడ్డం పెట్టకోని ప్రభుత్వాన్ని నడుపాలని చూస్తున్నడు. ఆయన అసమర్థతను దాసుకుంనేందుకే బాబుతోని పంచాతిపెట్టుకుంటున్నడు..ఆయనను నమ్మలేం ’’ అని అనుమాన పడుతూ అటిటుగాకుండ మౌనం వహిస్తున్న మిత్రులకు ఒక్కటే చెప్పాలనిపిస్తుంది. ఈ నమ్మలేమనే వాదాన్నితెలంగాణలో ప్రతిపక్ష్ఆలయిన కాంగ్రేస్ తెలుగుదేశం తదితర తెలంగాణ నేతలు వారి రాజకీయావసరార్థం ఉపయోగించుకుంటున్నరనుకుందాం.వారి చాతి విశాలం చేసుకుని కేసీఆర్కు బేషరతు మద్దతిస్తరని మనం ఆశించలేం.అట్లనే ఎటువంటి ఎత్తుగడలు లేకుంటా ప్రతిపక్ష్లలను కేసీయార్ బొట్లు పెట్టి సమస్యలకు పరిష్కరాలు చెప్పండి అని పిలుస్తడని కూడా ఆశించలేం.ఎంత తెలంగాణ వాదులయినా వాల్లు రాజకీయాలు చేయకుండా 100 పర్సెంటు లవ్ టైపులో నడువాలంటే కుదరదు.అది వాల్లకుండే పరిమితి.కానీ తెలంగాణ కోసం ప్రాణాలయినా ఇవ్వడానికి సిద్దపడి ఎన్నోత్యాగాలకు ఓర్చిన మేధావులకు బుద్దిజీవులకు ఇటువంటి పరిమితులు లేవుకదా.మనకెందుకు మొహమాటాలు. అన్ని రాజకీయ పక్షలను ఐక్యం చేసే ప్రయత్నాలను ఉద్యమ స్పూర్తితో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయిన తరువాత కూడా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.అటువంటి అనివార్య పరిస్తితిలో తెలంగాణ రాష్ర్టం ఉన్నది.
తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించిన ఈ మేధావి విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ అడ్వకేట్ జర్నలిస్టు తదితర సమూహాలన్నీ ఈ విషయాన్ని తప్పనిసరిగ గమనించాలె.లేకుంటే వీరి ఎత్తుగడలు తెలంగాణ అంతర్గత రాజకీయ కొట్లాటగా మారి శత్రువుకు సందిచ్చే పరస్దితి దాపురించడం ఖాయం.గుంటకాడి నక్కలోతిగె సీమాంధ్ర ప్రభుత్వం రాజకీయ వర్గాలు మనలను అస్థిరపరిచేందుకు సదా సిద్దంగానే ఉంటరు, ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా మౌనం వహించాలని నా ఉద్దేశం కాదు. ప్రభుత్వానికి భరోసానిద్దామంటాన. సామాన్యులే కాక మేధావి వర్గం తన వెంటవున్నదనే ధైర్యం పూర్తిగా వున్నప్పుడు నాయకుడుగా రాష్ర్ట సియం మరికొంత ఆత్మస్థైర్యంతో పాలన సాగించే అవకాశముంటది.యిప్పుడు లేదనికాదు.మన చర్యల ద్వారా మన మద్దతును బహిరంగ పరచగలగాలి.మన యింట్లే ఎంతయినా లొల్లి పెట్టకుందాం గని బయటోనికి సందియ్యకుంట ఉండాలె.అట్లయినపుడే తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమయ్యే దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రణాలికలు సజావుగ అమలవుతయి.
ప్రభుత్వాలు లేని పోని హామీలు యిస్తుండటం వెనుక వున్నకారణం కూడా యిదే.ప్రజలు పౌరులు‘గా బాధ్యతతోటి ఉన్నరు మారిన్రు అని ప్రభుత్వాలు గుర్తించినపుడు భావోద్వేగపు హామీలు పథకాల ప్రకటన ఉండవు. నువ్వు ఏమన్న జేయి మాకు మాత్రం దక్కిందే లెక్క అనే భావనతో ఉంటే…వీరు హామీలు గుప్పించుడు అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చడంలో పరేశానవుడు నడుస్తది.ఇక్కడనే పౌరులుగా మన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాల్సి ఉంటుంది.తెలంగాణ కొత్త రాష్ర్టానికి ఈ అవసరం ఎంతో ఉన్నది.
సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలను(ఆంధ్ర ప్రజలను కూడా) ఇన్నాల్లూ యిటువంటి పరిస్తితిలోకి నెట్టడంలో కుట్ర ఉన్నది. ప్రజలకు సాగునీరు తాగునీరు భూపంపిణీ తదితర మౌళిక వసతులు కల్సించినప్పుడు తమ బతుకేదో తాము ఆత్మగౌరవంతో బతుకుతరు.ప్రభుత్వాలు అందించే రేషన్లకు తదితర ఉచితాలకు ఆశపడరు.అట్ల కాకుంటా వారిని క్రుత్రిమ కరువులోకి నెట్టి వారి జీవితాలను అభద్రతా భావంలోకి తోసినపుడు మాత్రమే ప్రభుత్వ సంక్ష్ మ పథకాల మీద ఆధారపడుతరు.ఈ విధానం రద్దుకావాలంటే తెలంగాణ రైతు స్వయం సమ్రుద్ది కావాలె.అందుకు దీర్ఘకాలిక స్వల్పకాలిక విధానాలను ప్రభుత్వం అమలుపరచాలె.అట్లా తెలంగాణలో విధానాలు అమలు కావాలె.అందుకు మన మైండుసెట్లు మారాలె.ప్రభుత్వాలయి మార్చాలె. మనముందల చంద్రబాబు రూపంల ఓ గుంటకాడి నక్క కాచుకుని వున్నడు. అందుకు ప్రస్తుతం మనం మన ప్రభుత్వాన్ని వెనుకేసుక రావడం వీలయితే ప్రేమించడం అనివార్యం.ఇది కొద్దిల కొత్త అనుభవమే అయినా మెదలు పెడుదాం.
(ఇంకావుంది)