mt_logo

పాలమూరులో తెలంగాణ పోరుయాత్రకు బ్రహ్మరధం

సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర మంగళవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, భూత్పూర్, పాలమూరు మీదుగా సాగింది. యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు.

పోరుయాత్ర బృందం కల్వకుర్తికి చేరుకున్నప్పుడు పాలమూరు చౌరస్తాలో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున హాజరై బృందానికి స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ నేతలు ప్రసంగించారు.

అనంతరం నాగర్‌కర్నూల్‌కు యాత్ర చేరుకున్నది. ఈ బృందానికి ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డితో పాటు తెలంగాణవాదులు, విద్యార్థులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ ప్రసంగించారు. తెలంగాణ ఆపడం ఎవడబ్బతరం కాదన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే మనమే లాగేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పేరుతో పగటి నాటకాలు ఆడుతున్న ప్రజాప్రతినిధుల పంచలు ఊడదీసి బంగాళాఖాతంలో తోసేందుకు తెలంగాణవాదులందరూ సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.నారాయణ, నాగం జనార్దన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ ఏర్పాటు కోసం సాగించాల్సిన పోరాటాలను గురించి వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

యాత్ర బిజినేపల్లి మండల కేంద్రానికి చేరుకున్నప్పుడు మహిళలు, తెలంగాణవాదులు ఎదురువెళ్ళి బోనాలతో స్వాగతం పలికారు. ప్రతిచోట యాత్రకు తెలంగాణవాదులు నీరాజనాలు పలికారు.. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *