mt_logo

56 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులే: గండ్ర

శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ఛీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో వివక్షకు గురయిందని, 56ఏళ్ళనుండీ తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నారని పేర్కొన్నారు. 1969 లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, పెద్దమనుషుల ఒప్పందాలేవీ అమలు కాలేదని అన్నారు. అప్పటికే విశాలాంధ్ర ఏర్పడి 13ఏళ్ళు అయ్యిందని, తెలంగాణ ప్రజలను మోసం చెయ్యడంతోనే జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు మొదలయ్యాయని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు సహకరిస్తామని చెప్పిన సీఎం, చంద్రబాబు, జగన్ ఇప్పుడిలా వ్యతిరేకించడాన్ని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు సంపాదించిన వారే విభజనను వ్యతిరేకిస్తున్నారని, వారి బాధ ప్రజల కోసం కాదని, కేవలం ఓట్లు, సీట్లు కోసమేనన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని, వారందరి పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని గండ్ర చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం తమను తామే బలిచేసుకున్నారని, ఎవరిమీదా గూండాగిరి చేయలేదని ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడుతుందని,  తెలంగాణకు ఎవరి సహాయసహకారాలు అవసరం లేదని, భావి తెలంగాణను ఏర్పాటుచేసుకుంటామని గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *