mt_logo

తెలంగాణ మట్టి మనిషి


పాండురంగారావు.. ఓ ఆరంభం.. ఊరుకైనా, ఉద్యమానికైనా!

ఆ స్వచ్ఛమైన తెలంగాణ మట్టి పరిమళపు పోరాటం.. స్వేచ్ఛావాయువు కోసం, ‘ప్రత్యేక’ అస్తిత్వం కోసం!

ఆయన ఆలోచన నిత్య నూతనం.. ఆయన ఆశయం తెలంగాణ వెలుగు కేతనం!

సొంత పాలనపై రెఫండం విధించుకొని మనమున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనని గుర్తుచేశాడు.

తెలంగాణపై వేల గొంతుల జనగర్జన వినిపించాడు. రీకాల్‌తో ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం పుట్టిన గడ్డ కోసం, పురుడు పోసుకున్న ఉద్యమం కోసం ఖర్చుచేశాడీ మట్టిమనిషి!

నల్లగొండ జిల్లా ఆలగడపలో రోడ్డుపక్కనే ‘మనిల్లు’. అదే వేనేపల్లి పాండురంగారావు ఇల్లు. తనదగ్గరికొచ్చే వారెవరిలోనూ పరాయివాళ్లమన్న భావన ఉండకూడదని ఈ పేరు పెట్టాడాయన. పాండురంగారావుది మొసంగి దొరల కుటుంబం. తెలంగాణ చారిత్రక నేపథ్యం.. రైతాంగ సాయుధ పోరాటానికి అండగా నిలిచారు వీరి పెద్దలు. ఈయన తాత లక్ష్మణరావు అప్పట్లోనే లండన్‌లో బారిష్టర్ చేసిన తెలంగాణ తొలితరం విద్యార్థి. తండ్రి నాలుగుభాషల్లో పండితుడు. దాశరధి వంటి వారికి కలం స్నేహితుడు. ఆయనెప్పుడూ చెబుతుండేవారట. ‘పట్టాల పుస్తకాలు చదివిందొక్కటే.. సమాజాన్ని చదివిందొక్క ఈ మాటలు పాండురంగారావు మదిలో బలంగా నాటుకుపోయాయి. ఆయన రెండో మాటనే ఎంచుకొని, అదే బాటలో పయనిస్తున్నాడు.

విద్యార్థి దశ నుంచే

పాండురంగారావు విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేశాడు. 1979.. మిర్యాలగూడలో ఎస్సెస్సీ చదివే రోజుల్లో ఎమ్యూజ్‌మెంట్ పార్కుకు వ్యతిరేకంగా ఈయన పోరాటం మొదలైంది. తర్వాత పలు ప్రజా సంఘాల్లో ఉంటూ సమాజ సేవకు కంకణ బద్దుడయ్యాడు.తక్కెళ్లపాడు-రాయనిపాలెం వరకు 20కిలోమీటర్ల మేర పూడి కాల్వను ప్రభుత్వంతో కొట్లాడి, ఓ అవినీతి ఏఈని సస్పెండ్ చేయించి మరీ బాగుచేయించాడు. 2 చెరువులు, 2వేల ఎకరాలకు సాగు నీరందించగలిగాడు.

సర్పంచ్‌గా అరంగేట్రం

అప్పటికే ఎప్పటినుంచో పాండురంగారావును సర్పంచ్ చేయాలని ఊరి జనం భావిస్తున్నారు. ఆయన మాత్రం మూడుసార్లు తప్పించుకున్నాడు. 2001లో నాలుగోసారి ఎట్టకేలకు జనమే ఆయనతో నామినేషన్ వేయించారు. పైసా ఖర్చు లేదు. ఎన్నికల ప్రచారం లేదు. అయినా గెలిచాడు. ఓ 400 మంది బ్యాలెట్ పత్రాలపై స్లోగన్లు రాసి అభిమానం చాటుకున్నారు. ఆయన కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే ఊళ్లో సారా నిషేధం పెట్టాడు. ఆలగడపలో మొదలైన ఈ ఉద్యమాన్ని 180 గ్రామాలకు తీసుకెళ్లగలిగాడు. తన ఊరితోపాటు చుట్టపక్కల పది గ్రామాల్లో ఐదేళ్లపాటు పూర్తిగా మద్యపాన నిషేధం పాటించగలిగాడు. గ్రామస్తులు ఇతర ప్రాంతాల్లో ఇబ్బందులు పడకుండా అప్పట్లోనే ఐడెంటిటీ కార్డులు ఇచ్చాడు.

ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశాడు. గ్రామంలోని యువకులకు పెళ్లికి ముందే వైద్య పరీక్షలు చేయించేవాడు. ఇక్కడో చిన్న సంఘటన చెప్పుకోవాలి.. ఆలగడప అనుబంధ గ్రామంలో సుబ్బిరెడ్డిగూడెంలో పెళ్లి జరిగింది.

అబ్బాయికి ఎయిడ్స్.. ఆ రోజు రాత్రి శోభనం.. సన్నిహితుల ద్వారా పాండురంగారావుకు విషయం తెలిసింది. కానీ గుంటూరులో ఉన్నాడు. ఎలా? అక్కడి నుంచే ఊళ్లోని యువకులను అప్రమత్తం చేశాడు. ఆయనా ఆగమేఘాల మీద వచ్చి అడ్డుకొని, ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా భర్త నుంచి ఓ బాధితురాలికి ఎయిడ్స్ పరిహారం ఇప్పించాడు.

ప్రజలకే ప్రాధాన్యమిచ్చే పాండురంగారావుకు ప్రొటోకాల్ పట్టింపులుండేవి కాదు. జాతీయ పర్వదినాలైన జనవరి 26, ఆగస్టు 15న పంచాయతీ సిబ్బందితోనే ఐదేళ్ల పాటు జెండావిష్కరణ చేయించి తన వ్యక్తిత్వం చాటుకున్నాడు. చిన్నపిల్లలు బోరు బావుల్లో పడకుండా గ్రామ పరిసరాల్లో నోళ్లు తెరుచుకున్న బోరుబావులను పూడ్చేయించాడు. బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి చదువులమ్మ ఒడికి చేర్చాడు. చాలామందిని సొంత ఖర్చుతో చదివించాడు.

రెఫరెండం

ఊరును కంటికిప్పలా కాచుకున్న పాండురంగారావు 2003లో తన రెండేళ్ల పాలనపై రెఫరెండం పెట్టుకున్నాడు. అప్పటివరకు దేశంలోనే ఎక్కడాలేని ప్రజాస్వామ్య విధానాన్ని ఆలగడపకు పరిచయం చేశాడు. గ్రామస్తులు మొదటిసారి కంటే ఎక్కువగా, 99శాతం మెజారిటీతో గెలిపించారు. ఆ రోజు జాతీయ మీడియా సైతం ఆలగడపను వెతుక్కుంటూ వచ్చింది. దాదాపు అన్ని తెలుగు పత్రికలూ సంపాదకీయం రాశాయి. ఈ విజయం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. ఆ క్రమంలోనే అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆలగడపను గుర్తించి మిర్యాలగూడకు పురా పథకం కేటాయించారు.(పట్టణంతోపాటు 15 కిలోమీటర్ల మేర ప్రత్యేకాభివృద్ధికి ఉద్దేశించిన ఈ పథకం స్వార్ధ ప్రజాప్రతినిధుల కారణంగా నీరుగారిపోవడం బాధాకరం). 2005లో పాండురంగారావు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా కేంద్రం నుంచి అవార్డు అందుకున్నాడు. అవినీతి రహిత పాలనపై దక్షిణాది రాష్ట్రాల తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ బెస్ట్ సర్పంచ్ అవార్డుకు ఈయన్ని ఎంపిక చేసింది. 2005లో పదవి నుంచి దిగిపోయే ముందు కూడా పాండురంగారావు రెఫరెండం విధించుకొని, అదే మెజారిటీతో మళ్లీ గెలుపొందాడు.

న్యాయపోరాటాలు

తెలంగాణకు పైసా ప్రయోజనం లేని పోతిడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుపై 2007లో హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. అదింకా నడుస్తూనే ఉంది. అదే ఏడాది నాగార్జునసాగర్ ఎడమకాల్వకు జూన్ ఒకటిన నీటిని విడుదల చేయాలంటూ పిటిషన్ వేసి విజయం సాధించాడు. మిర్యాలగూడలో కోట్లాది రూపాయల విలువైన ఎన్‌ఎస్8పీ క్వార్టర్ట్స్, ఇళ్ల స్థలాలను ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులపై పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. స్పందించిన న్యాయస్థానం తగు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

పాదయాత్రలు

2006లో యురేనియం పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశాడు. జనవరి 3-7వరకు పెద్దగట్టు నుంచి దేవరకొండలోని శేరిపల్లి వరకు శాస్త్రవేత్తలతో కలిసి 150 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాడు. ఆ దెబ్బకు శేరిపల్లిలో యురేనియం శుద్ధికార్మాగారం నిలిచిపోయింది. 2008 అక్టోబర్‌లో వారం పాటు పొట్టిచెలిమె నుంచి ఖమ్మం జిల్లా వైరా వరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై 38 అంశాల మీద అధ్యయనం చేసి, ఆ నివేదికను నీటి పారుదల శాఖకు అందజేశాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైనా ఇందులో నివేదించాడు. మరుగునపడిన టెయిల్‌పాండ్‌ను అనేక ఉద్యమాలతో సాధించాడు. ఆ తర్వాత దానికి ‘నందికొండ సాగర్’ గా నామకరణం చేసింది కూడా ఆయనే. నిజాం షుగర్స్, పురా పథకం, రాచకొండగుట్టలు, దక్కన్ క్రోమైల్, ఫ్లోరైడ్, ఎన్‌కౌంటర్లు, జాతీయ రహదారి సమస్యలపై పలు ప్రజా ఉద్యమాలు నిర్మించాడు.

తెలంగాణ ఉద్యమం

తెలంగాణ కోసం పాండురంగారావు ‘తెలంగాణ మట్టిమనుషుల వేదిక’ను స్థాపించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టాడు. తెలంగాణపై సొంతూళ్లో రెఫరెండం పెట్టి 99శాతం మెజారిటీతో ‘ప్రత్యేక’ ఆకాంక్షను వినిపించాడు. ఆ తర్వాత కరీంనగర్ ఉప ఎన్నికల సమయంలో రాయినిపాలెం, బాదలాపురం గ్రామాల్లోనూ రెఫరెండం నిర్వహించి, తెలంగాణ సెంటిమెంట్ బలంగా లేదన్న వాదనలను ఆ ఫలితాలతో తిప్పికొట్టాడు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్, టీఆర్‌ఎస్8 అధినేత కేసీఆర్ తదితరులు ఆలగడపలో అభినందన సభ కూడా నిర్వహించారు. అదే ఏడాది ‘మా తెలంగాణ మాగ్గావాలె’ అంటూ తెలంగాణ ముఖద్వారం కోదాడలోని నల్లబండగూడెం నుంచి హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వరకు 200కి.మీ. పాదయాత్ర చేశాడు. మిర్యాలగూడలో రెండ్రోజులపాటు ‘తెలంగాణ మట్టి మహిళల ముచ్చట్లు’ నిర్వహించాడు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మహిళలు మమేకమయ్యేందుకు నిర్వహించిన తొలి కార్యక్షికమమిది. 2007 సెప్టెంబర్ 17న మట్టిమనుషులతో ఢిల్లీ యాత్ర చేపట్టాడు. సామాన్య ప్రజలు తెలంగాణ కోసం కేంద్రం దగ్గరకు వెళ్లడం కూడా ఇదే ప్రథమం. నవంబర్ ఒకటిన తెలంగాణకు మద్దతుగా హాలియాలో సీమాంధ్రుల సంఘీభావ సభ నిర్వహించాడు. పోలవరం ముంపు గ్రామాల్లోనూ పాండురంగారావు పాదయాత్ర చేపట్టాడు. తెలంగాణపై పల్లె ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఆయన ఈ మధ్యే ‘‘తెలంగాణ బండి’’ తీసుకున్నాడు. ఈ వాహనం ద్వారా ఊరూరూ తిరుగుతూ కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాజాగా ‘2011 పోతుంది. 2012 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోవాలి. తెలంగాణ రాష్ట్రం రావాలి’ అంటూ ఈ డిసెంబర్ 31న కొండ్రపోలులో 48 గంటల దీక్ష చేపట్టాడు. ఈ రోజు (18-01-2012) కూడా తెలంగాణ కోసం దీక్షలోనే ఉన్నాడు పాండురంగారావు.

మట్టిమనుషుల వేదిక ఆధ్వర్యంలో మిర్యాలగూడలో తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మిస్తున్నాడు. పాండురంగారావులో ఓ కవి, కళాకారుడు కూడా ఉన్నారు. ఈ చొరవతోనే సామాజిక చైతన్యం కోసం సొంత ఖర్చుతో మిర్యాలగూడలో చాలా నాటకాలు ప్రదర్శించాడు. జల్ జలా మొదలు కావడి కుండలు వరకు 15 మట్టిముద్రణలను (పుస్తకాలను)వెలుగులోకి తీసుకొచ్చాడు. పుస్తకావిష్కరణలు కూడా ప్రజల మధ్యో, ప్రకృతి నడుమో నిర్వహిస్తుంటాడీ మట్టిమనిషి..!

By: ఎం. నరేందర్, నల్లగొండ

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *