mt_logo

ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ సంఘ్ ఘనవిజయం

ఫొటో: జూబ్లీ బస్ స్టాండ్ ఎదుట తెలంగాణ కార్మికుల సంబురాలు 

తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల భవిష్యత్ ఎట్లా ఉండబోతుందో నిన్నటి ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికలు నిరూపించాయి. సకల జనుల సమ్మె సమయంలో సీమాంధ్ర నాయకులతో కలిసి సమ్మె విచ్చిన్నానికి కుట్ర పన్నిన నేషనల్ మజ్దూర్ సంఘ్ (ఎన్.ఎం.యు) ను తెలంగాణ ప్రాంత ఆర్టీసీ ఉద్యోగులు చిత్తుచిత్తుగా ఓడించారు. దశాబ్దాలుగా ఉనికిలో ఉండి గత పదేళ్ళుగా ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ గా చక్రం తీపుతున్న ఎన్.ఎం.యు. ను కేవలం యేడాది వయసున్న తెలంగాణ మజ్దూర్ సంఘ్ మట్టి కరిపించింది. ఎన్నికలు ఏవైనా తెలంగాణ భూమిపుత్రులు రాష్ట్ర సాధన ఆకాంక్షనే వెల్లడిస్తారని మరోసారి నిరూపణ అయ్యింది.

సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో ఎన్.ఎం.యు నేతలు మహమూద్, నాగేశ్వర రావులు రవాణా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణతో కలిసి సమ్మె విచ్చిత్తికి కుట్ర పన్నారు. తమకు అనుకూలంగా ఉండే కొంతమంది సీమాంధ్ర కార్మికులను విధుల్లోకి పంపి సమ్మెను ముగిస్తున్నామని ఏకపక్షంగా ప్రకటించారు. దీనితో ఆగ్రహించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అప్పటీకప్పుడు ఎన్.ఎం.యు. నుండి వేరుపడి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ను స్థాపించుకున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం అంతటా టి.ఎం.యు హవానే కొనసాగింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 25 డిపోలు ఉంటే అందులో 24 తెలంగాణ మజ్దూర్ సంఘ్ గెలుచుకుని, రాజధానిలో తెలంగాణావాదం బలంగా లేదనే వాళ్ల నోర్లు మూయించింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ జయకేతనం ఎగరేసింది.

తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు, టి.ఎం.యు. నేతలు అశ్వథామ రెడ్డి, థామస్ రెడ్డిలు గత యేడాదిగా చేసిన కృషి ఫలించింది. జంటనగరాలతో సహా మొత్తం పది జిల్లాలో తెలంగాణ మజ్దూర్ సంఘ్ కూటమి ఘనవిజయం సాధించింది.

ఇక్కడ జై తెలంగాణ అన్న నినాదంతో, అటు సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర అని రెండు కళ్ల సిద్ధాంతంతో మోసంచేయబోయిన ఎన్.ఎం.యు రెండు చోట్లా బోల్తాకొట్టింది. రేపు తెలంగాణలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఫలితాలు రాబోనున్నాయో ఇప్పుడు ఆర్టీసీ ఎన్నికలే సూచిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *