mt_logo

తెలంగాణ రాజముద్ర రెడీ!

తెలంగాణ ప్రభుత్వ రాజచిహ్నం సిద్ధమైంది. ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన తెలంగాణ లోగో చూడగానే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఆశించిన అంశాలు అచ్చుగుద్దినట్లుగా ఉన్నాయని కేసీఆర్ ఏలె లక్ష్మణ్ ను అభినందించారు. జూన్ 2న రాజ్ భవన్ లో సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సంతకాలు చేసే పత్రాలపై ఈ లోగోనే ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా లక్ష్మణ్ గీసిన రాజముద్రను గవర్నర్ ప్రకటిస్తారని సమాచారం.

నల్లగొండ జిల్లాకు చెందిన ఏలె లక్ష్మణ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేల బొమ్మలు, ఎన్నో అవార్డులు, మరెన్నో కీర్తి ప్రతిష్ఠలు ఆయన సొంతం. రెండున్నర దశాబ్దాలుగా వందలకొద్దీ చిత్రప్రదర్శనలు దేశవిదేశాల్లో ఇచ్చినా తెలంగాణ రాజముద్ర రూపొందించడంలో ఉన్న తృప్తి మరెందులో లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ఆవిర్భవానికి కూడా లోగోను, పోస్టర్ ను తానే రూపొందించానని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ రాజముద్రలో దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, మానవ మనుగడ లాంటి అనేక అంశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కోరుకునే బంగారు తెలంగాణ సూచించేందుకు లోగో చుట్టూ బంగారు వర్ణంతో వలయం, అశోకుడి విజయచక్రం, నాలుగు సింహాల చిహ్నం ఉంటాయి. అదేవిధంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. లోగో కింది భాగంలో సత్యమేవ జయతే అని హిందీ వాక్యాలు ఉన్నాయి. కాకతీయుల కళావైభవాన్ని గుర్తుచేసే తోరణం, ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే బతుకుకు చిహ్నంగా నిర్మించిన చార్మినార్ ముఖచిత్రం పొందుపరచబడ్డాయి. లోగో మొత్తం పచ్చరంగుతో గీయడం జరిగింది. పచ్చరంగు శాంతికి చిహ్నం. తెలంగాణ ఎప్పుడూ శాంతితో వర్ధిల్లాలని కోరుకుంటూ రాజముద్రను పూర్తిచేశానని లక్ష్మణ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *