mt_logo

తెలంగాణ జాగృతి

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

కల్వకుంట్ల కవిత..

పరిచయం అక్కర్లేని పేరు..
తెలుసుకోవాల్సిన అవసరమున్న వ్యక్తి!
కేసీఆర్ బిడ్డగా కాకుండా తన ఉనికితో
ప్రత్యేకతను చాటుకుంటున్న వనిత!
అందుకే తండ్రిని అనుకరించకుండా స్ఫూర్తిని మాత్రమే తీసుకుంటూ అడుగులు వేసింది..
జాగృతితో తెలంగాణ సంస్కృతి ప్రాధాన్యాన్ని చాటింది.. బతుకమ్మకు పూర్వవైభవం తెచ్చింది!
తెలంగాణ మహిళను జాగృతం చేసి
విముక్తి పోరాటంలో భాగస్వాములను చేసింది..
ఆ ప్రయత్నం కల్పించిన అవగాహన..
ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతోనే
రాజకీయాల్లోకి వచ్చింది..
వారసత్వ వాసనతో కాకుండా
చైతన్య స్రవంతితో గెలిచింది..
తెలంగాణరాష్ట్ర తొలి మహిళా ఎంపీగా
రేపు పార్లమెంటులో జనగళం
వినిపించనున్నది!
జగమెరిగిన ఆ ఆడబిడ్డ ఈ జిందగీకి
ఇవ్వాళ్టి అతిథి….

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిడ్డగా కవిత ప్రత్యేకంగా పెరగలేదు. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయినా… సాధారణ తండ్రి బిడ్డగా సామాన్యంగానే ఉంది. కార్పొరేట్ స్కూల్లో చదివినా ఇతర నాయకుల పిల్లల్లా ఆమె కార్లలో తిరగలేదు. సిటీ బస్సుల్లోనే వెళ్లేది. బిడ్డ మీదున్న ప్రేమను బాహాటంగా చాటుకునే వ్యక్తి కాదు కేసీఆర్. ఆ స్వభావానికి తగిన కూతురు ఆమె! నాన్న వేలు పట్టుకొని అడుగులు వేయకపోయినా ఆయన అడుగుల జాడల్ని పట్టుకుంది. కూర్చోబెట్టి సలహాలు ఇవ్వకపోయినా ఆయన కార్యాచరణను మార్గదర్శకంగా మలుచుకుంది. అందుకే అంటుంది ఆమె నాన్నే నాకు స్ఫూర్తి, ఫిలాసఫర్, గైడ్ అన్నీ అని! ఎలాంటి పరిస్థితులనైనా బ్యాలెన్స్ చేసే తత్వాన్ని అమ్మ నుంచి నేర్చుకుంది. సహనం ఆమె ఆచరణ ద్వారా నేర్చుకున్న ప్రాక్టికల్ లెసన్ అంటుంది. తల్లి మోటివేషనే తమ కుటుంబానికి బూస్ట్ అని చెబుతుంది. అయితే తాను సామాజిక పాఠాలు నేర్చుకుంది మాత్రం తెలంగాణ పిత.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర. జయశంకర్ సార్ తెలంగాణ మానసిక, భౌతిక స్వరూపం గురించి తన తండ్రి చెప్పే విషయాలన్నీ ఆమెను ఆకర్షించాయి. తెలంగాణ సమాజం గురించి తెల్సుకోవాలన్న కుతూహలాన్ని రేకెత్తించాయి. ఆ తపనే జాగృతి సంస్థ ఆవిర్భవానికి అంకురం మైంది! అందులో పనిచేసిన అనుభవమే రాజకీయ ప్రవేశానికి ప్రేరణ అయింది. అందుకే అంటుంది కవిత జయశంకర్ సార్ తనకు రాజకీయ గురువు అని!

2006.. ఒక సందర్భం…

రాజకీయాల్లో తండ్రికాక జయశంకర్ సారే గురువుగా మారడానికి ఒక కారణం ఉంది. ఇంజనీరింగ్, పెళ్లి అయిపోయి భర్తతో అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడ తెలంగాణ కోసం తండ్రి చేస్తున్న పోరాటంతో అప్పుడు ఆమెకెలాంటి సంబంధం, ఆసక్తి రెండూ లేకుండె! కేసీఆర్ కూడా తన రాజకీయ జీవితం నుంచి పిల్లల్ని వేరుచేశాడు. ఆ నీడ కూడా పడనీయలేదు. ఎప్పుడైతే ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చిందో అప్పుడు ఆయన పోరాటాన్ని గమనించగలిగింది. 2006లో ఒక సందర్భం… ఉద్యమంలో భాగంగా కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికలకు వెళ్లాడు. ఎంత సవాల్ చేసే పరిస్థితి వచ్చినా ఇవ్వాళ్రేపు సర్పంచ్ కూడా రాజీనామా చెయ్యడు అలాంటిది నాన్న కేంద్రమంత్రి పదవిని గడ్డిపోచలా విదిల్చిన కారణమేమై ఉంటుంది? పైగా నాన్నకప్పుడు సోనియాగాంధీతో మంచి అనుబంధమే ఉంది కదా.. అంత సీరియస్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న ఆలోచన ఆమెను తెలంగాణ ఉద్యమంలోకి లాగింది. పిల్లల మీద రాజకీయాల ప్రభావం పడకూడదని ఎంత అనుకున్నాడో, పిల్లలు రాజకీయ అజ్ఞానంలో ఉండకూడదనీ అంతే జాగ్రత్త పడ్డాడు కేసీఆర్. అందుకే తెలంగాణకు సంబంధించి కేంద్రం తీరు, జరుగుతున్న పరిణామాలను పిల్లలకు చెప్పేవాడు. అలా 2004లో కాంగ్రెస్ తన అజెండాలో తెలంగాణను పెట్టడం, ఆ ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పాటు తథ్యమనే తన ఆశను, పొలిటికల్ ప్రాసెస్ మీద తనకున్న నమ్మకాన్నీ పిల్లలతో పంచుకున్నాడు. అది వమ్ము చేస్తూ తెలంగాణ ఏర్పాటుకు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సైంధవుడిలా అడ్డుతగలడాన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ రాజీనామా చేశాడు.

ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము అయితే వచ్చే బాధను, ఫీలింగ్‌ను నాన్న కళ్లల్లో రెండు సార్లు చూశాను. ఒకటి చంద్రబాబునాయుడు తన టీమ్‌లో నాన్నను ఇన్‌క్లూడ్ చేసుకోనప్పుడు, రెండు 2004లో తెలంగాణకు రాజశేఖర్‌రెడ్డి అడ్డుతగులుతుంటే నమ్ముకున్న సోనియా మౌనంగా ఉన్నప్పుడు. తన లక్ష్యం ముందు, అది నేరవేరుతుందనే విశ్వాసం ముందు మంత్రి పదవి అనేది ఆయనకు నథింగ్ అనేది టైమ్ అండ్ ఎగైన్ ఆయన ప్రూవ్ చేశారు! ఆయన ఆ కమిట్‌మెంటే తెలంగాణకు సంబంధించి నాకు స్ఫూర్తిగా నిలిచింది! అని చెప్తుంది. అదే ఆమె ఆ ఉప ఎన్నికల్లో తండ్రి తరపున ప్రచారానికి వెళ్లేలా చేసింది. ఆయన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో తమ కుటుంబంలోని ఆడవాళ్లు ప్రచారానికి రావడం అదే తొలిసారి. నాన్న పర్మిషన్ లేకుండానే ప్రచారంలో పార్టిసిపేట్ చేసిన. ఒక్క తెలంగాణ నుంచే కాదు విదేశాల్లో ఉన్నోళ్లు కూడా పనిచేస్తుంటే నేను ఉట్టిగా కూర్చోడమేంటి? అనిపించి తెలంగాణ బిడ్డగా ఆ ప్రచారంలో పాలుపంచుకున్న. జనమైతే ప్రవాహంలా వచ్చిండ్రు.

సోషల్‌లైఫ్‌లో ఇన్‌వాల్వ్ కావడం నాకదే ఫస్ట్ టైమ్. అప్పుడు తెలిసింది నాకు పావర్టీ అంటే ఏంటీ? తెలంగాణకు ఎంత దుఃఖముందో? చాలామంది ఆడవాళ్లు నన్ను క్వశ్చన్ చేసిండ్రు.. మీలాంటి వాళ్లు ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని! అప్పుడే నేను ఇంకో విషయాన్ని కూడా గమనించిన.. ఆడవాళ్లు మగనేతలు వెళితే పెద్దగా స్పందించరు. అదే ఆడవాళ్లు వెళితే మనసు విప్పి మాట్లాడ్తారు. తమ సాధకబాధకాలను ఏకరువు పెట్టుకుంటారు! స్వేచ్ఛగా ఉంటరు. ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాంటింగ్ విమెన్ రిప్రజెంటేటీవ్స్. అప్పుడనుకున్నాను నేనెందుకు రాకూడదు అని. అట్లా ఉద్యమంలోకి వచ్చాను అని తనను కదిలించిన, ఆలోచింపచేసిన కారణాలను వివరిస్తుంది కవిత.

మహిళా జాగృతి

ఉత్తుంగ తరంగంలా ఉద్యమంలోకి రానైతే వచ్చింది కానీ వచ్చాక తెలిసింది.. అంతా ఎడారిలా ఉందని. కళాకారులు ఒకవైపు, విద్యావంతులు ఒకవైపు, మేధోవర్గం ఒకవైపు, ఉద్యోగులు ఒకవైపు, నాయకులు ఇంకో వైపు ఇలా ఎవరిదివాళ్లు వాళ్లకు తోచిన మార్గాల్లో తెలంగాణ సాధన కోసం నడుంబిగించారు. ఈ మొత్తంలో మహిళలెక్కడా కనిపించలేదు తనకు. ఎలీట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒకరిద్దరు మినహా! స్త్రీలను ఎలా తీసుకురావాలి? ఆ మార్గం దొరకాలంటే ముందసలు తెలంగాణ అంటే ఏంటో తెలియాలి అనుకుంది. ఒక యేడాది తెలంగాణ అంతా తిరిగింది. దాదాపు లక్ష కిలోమీటర్లు. అంత తిరిగితే తెలిసింది అసలు తెలంగాణ. ఆ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తే అర్థమైంది తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు వెనకపడేయబడ్డ ప్రాంతమని! అప్పుడు నిర్ణయించుకున్న తెలంగాణ కోసం ఏదైనా చేయాలి. అట్లా మొదలైందే జాగృతి. అంతేకానీ కేసీఆర్ కూతుర్ని కాబట్టి ఆ పేరుతో ఓ ఎన్‌జీవో పెట్టుకుందామన్న ఆలోచనతో కాదు. అసలామాటకొస్తే ఇలాంటి రిస్క్స్ తీసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. ఎందుకంటే నాదీ మిగిలిన రాజకీయ నాయకుల కూతుళ్లలాగే కాన్వెంట్ స్కూల్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, పెళ్లి, అమెరికా.. ఏ కష్టం తెలియని బాయిలర్ కోళ్ల లైఫే! ఆ మూసనుంచి ప్రజల సమూహంలోకి రావడం, ఆ కల్చర్‌ని అలవాటు చేసుకోవడం కష్టమైన పని! అయినా ఇష్టంగా తీసుకున్న నిర్ణయం, జయశంకర్ సార్ ఇచ్చిన ప్రేరణ, తెలంగాణ కోసం నేనూ నడుంకట్టాలన్న భావన నడిపించిన మార్గం అది.

ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు చాలా ఆలోచించాను. మా అత్తగారు, హజ్బెండ్‌ని కన్విన్స్ చేశాను. అట్లా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని అడుగేశాను. అయితే చాలామంది నా సంస్థకు తెలంగాణ అని పేరు పెట్టకు. లేకుంటే ఫండ్స్ రావు అన్నారు. నేను తెలంగాణ బిడ్డనే అయినప్పుడు ఆ పేరు పెట్టకుండా ఎట్లా ఉంటానని కావాలనే తెలంగాణ జాగృతి అని పెట్టాను అని తెలంగాణ జాగృతి ఆవిర్భావానికి గల నేపథ్యాన్ని వివరిస్తుంది. సంస్థ పెట్టినతర్వాత ఇంకెన్నో కొత్త సమస్యలు అనుభవంలోకి వచ్చాయి ఆమెకు. అడుగడుగునా వివక్ష, కామెంట్లు.. అయితే ఇవన్నీ కవితను బలహీనం చేయలేదు మరింత బలవంతురాలిగా మార్చాయి. అప్పుడు అర్థమైంది ఆమె తన తండ్రి ఎదుర్కొంటున్న అవమానాలు. మొండిగా నిలిచిన ఆయన ధైర్యం! అది ఆమెకూ వారసత్వంగా అబ్బింది. అందుకే ఎన్ని ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడింది.

బాలగంగాధర్ తిలక్.. కాళోజీ.. బతుకమ్మ

జాగృతి సంస్థను పెడ్తున్నట్టు తండ్రికి మాటైనా చెప్పలేదు, పెట్టడానికి సలహా కూడా తీసుకోలేదు. ఆ విషయం ఆయనకు ఎప్పుడు తెలిసిందంటే… జాగృతిని బతుకమ్మ ఆట, పాటతో ముందుకు తీసుకెళ్లాలని తన స్నేహితురాలైన పార్వతి మెల్టన్‌తో బతుకమ్మ ఆడుతున్నట్టు యాడ్ తయారుచేయించి ఫైనల్‌కాపీగా తండ్రికి చూపించినప్పుడు. ఒకింత ఆశ్చర్యం ఆయనకు. అయినా దాన్ని వ్యక్తపర్చకుండా ఆ యాడ్‌లో చిన్న సవరింపు మాత్రం చెప్పి ఊరుకున్నాడు ఆయన. ఈ ప్రస్థావన ఎందుకంటే.. మొదటి నుంచి కవిత స్వతంత్ర భావాలు కల వ్యక్తి అని చెప్పడానికి. తండ్రి అనుమతి లేనిదే ఆయన పనుల్లో జోక్యం చేసుకోదు, తన పనుల కోసం తండ్రి మీద ఆధారపడదు. తండ్రి ఆలోచనలతో ప్రభావం చెంది ఆయనలాగే ప్రవర్తించడం వల్ల తన ఐడెంటిటీనే కాదు తన జనరేషన్ ఆలోచనలను, కొత్తదనాన్నీ కోల్పోతానని ఆమె భావన. ఆ భావంతోనే తెలంగాణ ఉద్యమానికి కూడా తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పర్చుకుంది.

మూవ్‌మెంట్‌కి సంబంధించి నాన్న ఇన్‌ఫ్లుయెన్స్ నా మీద అంతగా లేదు కానీ .. ఈ ఉద్యమంలో నాకు ఫాదర్ ఫిగర్‌గా ఉన్నది మాత్రం జయశంకర్ సార్. ఏ విషయమైనా ఆయనతో షేర్ చేసుకునేదాన్ని. అదీ కూడా ఒకటి రెండు బతుకమ్మలయ్యాకే! జయశంకర్ సార్ కూడా ముందు నన్ను టెస్ట్ చేశాడు నేనెంత వరకు నిలబడగలను అని. నమ్మకం కుదిరాకే కావల్సిన సలహాలివ్వడం స్టార్ట్ చేశాడు. నాకు జయశంకర్ సార్ దగ్గర బాగా నచ్చిన విషయం ఆయన కన్‌సిస్టెన్స్. నాన్న కూడా సందర్భం వచ్చినప్పుడల్లా జయశంకర్ సార్ గురించి చెప్పేవాడు. కొన్నికొన్ని సార్లు నాన్నతో చర్చిస్తూ మా ఇంట్లోనే ఉండిపోయేటోడు. దాంతో ఆయనతో మరింత దగ్గరితనం పెరిగింది మాకు. అట్లా నాన్నతో షేర్ చేసుకోలేనివి కూడా జయశంకర్ సార్‌తో షేర్ చేసుకునేవాళ్లం! అని నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటుంది. అయితే జయశంకర్‌సార్ అయినా.. ఇంకెవరైనా తన నిర్ణయానికి మెరుగులు అద్దడమే కానీ పూర్తిగా నిర్ణయాన్ని మార్చే ఆలోచనలను ఆమె ఎప్పుడూ ఒప్పుకోలేదు, ఒప్పుకోదు కూడా! ఆ పట్టుదల ఇతరులకు పొగరుగా కనిపించినా ఆత్మవిశ్వాసంగా కవితను ముందుకు నడిపిస్తుంది. కోటి బతుకమ్మ జాతర ఆలోచనను ఆమె బయటపెట్టినప్పుడు కోటి ఎట్లయితరే అని చాలామంది హేళన చేశారు. కానీ ఆమెకున్న ఆ విశ్వాసమే కోటి బతుకమ్మలను పేర్చి ఒక్క చోటికి చేర్చింది.

ఇట్లా తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్రను పెంచగలిగింది! అట్లనే కవిత ఉనికినీ చాటగలిగింది. ఎంతంటే.. ఈ రోజు ఆమె తెలంగాణలోని ఏ మూలకు వెళ్లినా కవితక్కా… అంటూ ఆమె చుట్టూ మూగేంత! జాగృతి ద్వారా బతుకమ్మ మొదలుపెట్టిన కొత్తలో నలభై ఏళ్లు దాటినవాళ్లే ఎక్కువగా వచ్చేవాళ్లు. కానీ ఓ రెండేళ్ల కిందటి నుంచి పద్నాలుగు, పదిహేనేళ్ల పిల్లలు కూడా లంగాఓణీ వేసుకొని బతుకమ్మ ఆడ్డానికి వస్తున్నరు. చర్చల్లో పాల్గొంటున్నరు అని ఉద్యమంలో వయస్సుకి అతీతంగా మహిళలను జాగృతి బతుకమ్మ ఎలా జాగృతం చేసిందో చెప్తుంది. ఉద్యమానికి బతుకమ్మ పండుగని వేదిక చేసుకోవాలన్న ఇంగితం ఆమెకు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్య్ర ఉద్యమంలో వినాయక చవితి నవరాత్రులు కల్పించింది. ఈ స్ఫూర్తినే నిజాం కాలంలో కాళోజీ కొనసాగించిన విషయమూ ఆమె సంకల్పానికి మరింత బలాన్నిచ్చింది! ప్రయత్నించింది.. విజయం సాధించింది! జాగృతిలో ఆరు విభాగాలున్నా వ్యూహాత్మకంగా బతుకమ్మనే హైలైట్ చేసింది కవిత తెలంగాణ ఉద్యమంలో భాగంగా! అందుకే ఇది కేవలం సాంస్కతిక సంస్థేమో అన్న అపోహ ఉంది చాలామందికి. కానీ కాదు ఇదో సామాజిక సంస్థ. ముఖ్యంగా ఆడపిల్లల చదువు, ఆరోగ్యం వంటి అంశాల మీద ఎంతో కృషిచేసింది. ఇక ముందూ మరిన్ని సమస్యల మీద దృష్టిపెడుతూ మహిళలను, యూత్‌ని జాగృతం చేస్తూనే ఉంటుంది జాగృతి అని ధృవపరుస్తుంది కవిత.

బీ విత్ తెలంగాణ

జాగృతి.. ఒక పీపుల్స్ ఆర్గనైజేషన్. ఇలాంటి అనేక ప్రజాసంఘాలు తెలియకుండానే రాజకీయాల్లో ఇన్‌వాల్వ్ అయ్యాయి. తెలంగాణ కాంటెక్ట్స్‌లో పాలిటిక్స్, మూవ్‌మెంట్, ఆర్గనైజేషన్స్ ఒకదానికొకటి అనుసంధానమైయిపోయినయ్. అట్లా ఎమోషనల్‌గా మూవ్‌మెంట్‌లోకొచ్చిన నేను జాగృతి ద్వారా తెలియకుండానే పాలిటిక్స్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయిన. అంతమాత్రాన పాలిటిక్స్ అనేది నా అల్టిమేట్ గోల్ కాదు. ఇదొక మజిలీ మాత్రమే! నా అంతిమ లక్ష్యం తెలంగాణ పునర్నిర్మాణం.. తెలంగాణ ఆశయాలు, ఆశలు నేరవేర్చుకోవడం.. అవి సాధించిన తర్వాత మన ప్రజల కళ్లల్లో కనిపించే ఆనందం చూడ్డం! ఈ ప్రయాణంలో నేనిప్పటివరకు చేరుకున్నవన్నీ మజిలీలు మాత్రమే. లైఫ్ ఈజ్ బీ విత్ తెలంగాణ! ఒక మహిళా ఎంపీగా నేను మహిళలకు చేయాల్సిన పనులెన్నో ఉన్నయ్. ముందుగా బీడీ కార్మికులు, వ్యవసాయ మహిళా కూలీలు, అట్లనే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలే కాకుండా బయట ఉన్న మహిళల సమస్యల మీద దృష్టిపెట్టాలనుకుంటున్నా.

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడున్నర లక్షల బీడీ కార్మికుల సమస్యలను అడ్రస్ చేయాలనుకుంటున్నా. దీనివల్ల మిగిలిన వాళ్లకూ కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ల సమస్యలతో నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే అన్నిటికన్నా ముఖ్యం.. ఇప్పుడు అత్యవసరమైంది విమెన్ సెక్యూరిటీ! గ్రామాల్లో కూడా మహిళల మీద జరిగే అరాచకాల్లో ఇప్పటికీ 90 శాతం రిపోర్ట్ అవట్లేదు. మహిళల్లో లీగల్ నాలెడ్జ్‌ను కల్పించడం, క్రైమ్ రేట్‌ను తగ్గించడం కూడా నా ప్రణాళికల్లో ఒకటి. నేను రఫ్‌గా ప్రపోజ్ చేసిందేందంటే.. మండలానికో మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి. వాటిల్లో ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ ఉండాలి. అలాగే ఫినిషింగ్ స్కూల్స్ కాన్సెప్ట్‌ను కేజీ టు పీజీ స్థాయిదాకా ప్రవేశపెట్టాలి. స్త్రీలకు సంబంధించి నా ముందున్న లక్ష్యాలు ఇవి. పాలిటిక్స్‌లో మిగిలిన వాళ్లెలా ఉన్నా నేను, మా బ్రదర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుట్లో బీయింగ్ ఎ ఉమన్ నాకు కొన్ని స్పెషల్ చాలెంజెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉంటూ మొండిగా సాధించడమే! విమెన్ ఇంట్లో, బయటా డబుల్ పని చేయాలి కాబట్టి.. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ముందు ఫ్యామిలీని కన్విన్స్ చేసుకోవాలి. వాళ్లను కన్విన్స్ చేస్తేనే బయట విజయం సాధించగలం. ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ డిస్ట్రబెన్స్ బయట పనుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఫస్ట్ వి హావ్ టు కన్విన్స్ అండ్ బ్యాలెన్స్ అవర్ ఫ్యామిలీ! అంటూ తన అనుభవసారాన్ని ఈ తరం అమ్మాయిలకు అందించింది కల్వకుంట్ల కవిత! ది ఫస్ట్ ఉమన్ ఎంపీ ఆఫ్ తెలంగాణ స్టేట్! కవితను చూసిన ఒక పెద్దాయన కేసీఆర్‌తో నీకు గౌరమ్మ పుట్టింది అన్నాడట. నిన్ను చూసి నాకు అభినందనలు తెలిపే రోజొచ్చిందని కూతురితో చెప్తూ సంబరపడ్డాడట కేసీఆర్. ఆ పుత్రికోత్సాహం కేసీఆర్‌కే కాదు తెలంగాణకూ అందాలని ఆశిద్దాం!

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో..]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *