రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లులేని నిరుపేదలకు ఇప్పటి వరకూ 20 వేల కోట్లతో 2 లక్షల 70 వేల డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించామన్నారు. పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, రైతు బంధు , రైతు బీమా, సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు వేదికలు, నర్సరీ లు ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని, రైతు బంధు పథకం క్రింద ఇప్పటి వరకూ 50 వేల కోట్ల పంట పెట్టుబడి క్రింద సహాయoను రైతుల ఖాతాలో జమ చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. త్వరలోనే అర్హులై ఉండి పెన్షన్ రాని వారికి కొత్తగా పెన్షన్ లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.