ఒకప్పుడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నదీ జలాలు పారుతూ వ్యవసాయంలో సరికొత్త రికార్డులు సృస్టిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే రైతన్న కళ్ళలో మురిపెం కనపడుతున్నదని ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ఈ ఏడాది వానాకాలం పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గత సంవత్సరం వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది 1.34 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 41.76 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయాలని ప్రభుత్వ లక్ష్యం కాగా, అనుకున్న దానికంటే 5 లక్షల ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడ్డాయి. అదేమాదిరి 60.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, 58.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. మిగతా పంటలు కూడా దాదాపు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే సాగయ్యాయని వ్యవసాయ గణాంకాలు చెప్తున్నాయి.
గత వానాకాలం పంటతో పోలిస్తే రాష్ట్రంలో 36.59 శాతం పెరిగింది. వానాకాలం పంటల సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ తర్వాత జార్ఖండ్, తమిళనాడు రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. రైతుబంధు తో పాటు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం, సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం వల్ల అధిక పంటల సాగుకు తోడ్పడ్డాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.