mt_logo

మత్స్యకారుల ముఖాల్లో సంతోషం – జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల ముఖాల్లో సంతోషం నింపారని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు చివరి చెరువు అయిన పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలోని రావి చెరువుతో పాటు తన దత్తత గ్రామం అయిన చీదేళ్ల పెద్ద చెరువులో 2 లక్షల చేప పిల్లలను మంత్రి వదిలారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తడి ఆరిన తెలంగాణ బీడుభూములను తడిపి సస్యశ్యామలం చేస్తూ గోదావరి జలాలు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవం పోస్తుందని అన్నారు.

కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగానే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదని, అలాంటి రాష్ట్రాల మత్స్య సంపదలో పోటీపడి నీలి విప్లవం వైపు ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జెడ్పీటీసీ అనిత, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *