పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా ఏపీ భవన్ లో తెలంగాణకు వాటా ఉంటుందని, నిజాంకు చెందిన ఆస్తుల విభజన మాత్రం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఏపీ భవన్ ను సందర్శించి అక్కడి భవనాలు, కార్యాలయాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్ లో తెలంగాణకు వాటా ఉండదంటూ వస్తున్న వార్తలను కేసీఆర్ కొట్టిపడేశారు.
అనంతరం గురజాడ కాన్ఫరెన్స్ హాలులో మీడియాతో మాట్లాడిన సీఎం ఏపీ భవన్ లో ఉద్యోగుల విభజన సరిగా లేదని, ఏ ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంతంలోనే పనిచేయాలని కోరుకుంటారని, అందువల్ల ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కు వివరించామని తెలిపారు.
ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ గానీ, అజ్మీర్ లో ఉన్న భవనాలు గానీ, సౌదీఅరేబియాలో మక్కాకు సమీపంలో ఉన్న భవనం గానీ విభజించడానికి వీలుపడనివన్నారు. హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ భవనం కూడా అప్పట్లో వట్టికోట ఆళ్వారు స్వామి గ్రంధాలయ ఉద్యమంలో భాగంగా నిజాంపై కొట్లాడి సాధించుకున్నదని, దాన్ని కూడా విభజించడం సాధ్యం కాదని అన్నారు.