mt_logo

రుణమాఫీపై వెనక్కు తగ్గేది లేదు – కేసీఆర్

రైతుల రుణమాఫీపై వెనక్కు తగ్గేది లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు అమలుచేసి తీరుతామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీలను కలిసిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఒకసారి మాట ఇస్తే వెనక్కు తగ్గదని, మీడియా కూడా ఉద్దేశపూర్వకంగానే రైతుల్లో గందరగోళం సృష్టించిందని, ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఆ మీడియా పట్ల విశ్వాసం పోతుందని అన్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీడియా హుందాగా ప్రవర్తించాలని, ఒక మంత్రి సమన్వయలోపంతో చేసిన వ్యాఖ్యలపై మీడియా గందరగోళం సృష్టించిందని పేర్కొన్నారు.

కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం వెనుక ఏ రాజకీయ పార్టీ కుట్ర ఉందో ప్రజలకు తెలుసని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులైనా కాకముందే కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లాలనుకుంటున్నాయని, నాలుగు రోజుల్లోనే వాటి స్వభావం ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు. రైతుల రుణమాఫీ అమలులోకి రావడానికి పది లేదా పదిహేను రోజులు పడుతుందని, బ్యాంకులనుండి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని, కొంత సమయం పట్టినా ఈ పథకం ద్వారా 23 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని వివరించారు.

కేసీఆర్ పై ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పనిలేదని, కేసీఆర్ ఒకసారి మాట ఇస్తే వెనక్కు పోడన్న విషయాన్ని రైతులు గుర్తించాలని, రైతుల రుణమాఫీకి సుమారు 8,000 కోట్లనుండి 12,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని, అదనంగా మరో 10,000 కోట్లు ఖర్చయినా ఈ పథకం అమలయ్యే తీరుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఏ బ్యాంకు నుండి ఎంత రుణం తీసుకున్నారు? ఎన్ని బ్యాంకులనుండి తీసుకున్నారు? తదితర వివరాలు బ్యాంకర్లు సేకరించి ప్రభుత్వానికి పంపగానే వాటిని పరిశీలించి ప్రభుత్వం ఆర్ధిక శాఖకు పంపుతుందని, అక్కడినుండి రిజర్వు బ్యాంకుకు పంపగానే అనుమతి వచ్చిన తర్వాత రుణమాఫీ అమలులోకి వస్తుందని సీఎం చంద్రశేఖర్ రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *