హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ దవాఖానకు రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో దానిని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిమ్స్ విస్తరణ, కొత్తభవనాల నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన స్థలాన్ని వైద్యారోగ్యశాఖకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లతో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించిన డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. నిమ్స్ విస్తరణ పనుల బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది.
ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో 1,800 పడకలు అందుబాటులో ఉన్నాయి. దానికి అనుబంధంగా కొత్తగా నిర్మించనున్న భవనంలో మరో 2,000 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిమ్స్‌లో మొత్తం పడకల సంఖ్య 3,800కు పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న బెడ్స్‌లో 500 పడకలను ఐసీయూకు కేటాయిస్తారు. గుండె, కిడ్నీ, మెదడు, కాలేయం, క్యాన్సర్, అత్యవసర వైద్యసేవల విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్ తదితర 42 స్పెషాలిటీస్ సేవలు కొత్త భవనంలో అందుబాటులోకి రానున్నాయి. సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ హెల్త్ సైన్సెస్ విభాగాల్లో సైతం శిక్షణ కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరం నలువైపులా నిర్మించనున్న 4 టిమ్స్ సూపర్‌స్పెషాలిటీ దవాఖానల్లో 4,000 పడకలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో 2,000 పడకలు, నిమ్స్‌లో 2,000 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు :
నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంపై నిమ్స్ లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని కొనియాడారు.