గోదావరి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన క్యాంపు కార్యాయంలో గురువారం సుమారు ఆరు గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గూగుల్ ఎర్త్ ఫొటోలు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాపులను పరిశీలిస్తూ ఆయా ప్రాజెక్టులపై అధికారులతో చర్చలు జరిపారు. గోదావరి నదీ జలాలను సమర్ధంగా వినియోగించుకునేలా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ రీ డిజైన్ చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్(వ్యాప్కోస్) ను ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు తోడు అదనంగా 400 టీఎంసీల జలాలు వినియోగించుకుని రాష్ట్రంలో మరో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం తుమ్మిడిహట్టి నుండి ప్రారంభించి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం దాకా ప్రతి ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని సూచించారు.
ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలు చేసి తుమ్మిడిహట్టి వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద మరో ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాలతో పాటు నల్గొండ లోని కొన్ని కరువుప్రాంతాలకు కూడా నీరందించాలని సీఎం ఆదేశించారు. గోదావరి బేసిన్ లోని 54 నియోజకవర్గాల్లో నాలుగు అర్బన్ నియోజకవర్గాలు పోగా మిగిలిన 50 నియోజకవర్గాలకు సగటున లక్ష చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రవహించే గోదావరి జలాల్లో తెలంగాణకు 953 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని, కానీ 433 టీఎంసీల కోసమే ప్రాజెక్టులు ఉన్నాయని, మిగిలిన 521 టీఎంసీలు వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవాలని సీఎం చెప్పారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసిన ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవని, అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ కేసులు, అశాస్త్రీయ డిజైన్లు ఉండేలా ప్రాజెక్టులు రూపొందించారని, అసలు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావద్దనే దురుద్దేశమే పాలకులకు ఉండేదని సీఎం అన్నారు. ప్రస్తుతం మనం వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమర్ధంగా నీటిని వినియోగించేలా డిజైన్లు తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్, నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యాప్కోస్ జీఎం శంభు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.