జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ యావత్తూ సంబరాల్లో మునిగితేలే రోజు. 60 ఏళ్ల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటేలా చేసుకోవాలని ప్రజలంతా ఎదురుచూస్తున్న రోజు మరెంతో దూరం లేదు. జూన్ 1 అర్ధరాత్రి నుండే ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ పదిజిల్లాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో గులాబీశ్రేణులు బిజీగా ఉన్నారు. మరోవైపు జూన్ 2న ఉదయం 8.15 గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్ లోని 150 సెంటర్లను మొత్తం గులాబీ తోరణాలతో అలంకరించి గులాబీమయం చేస్తున్నారు. 50నుండి 60 అడుగుల ఎత్తైన కేసీఆర్ భారీ కటౌట్లను 25 సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజాలో ఆదివారం అర్ధరాత్రి పటాసులు కాల్చి సంబరాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ముంబై నుండి స్పెషల్ గా తయారుచేసిన సువాసనలు వెదజల్లే పటాసులు తెప్పిస్తున్నారు. 100 సెంటర్లలో స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాల కోసం డీజే సౌండ్ ను అనుసంధానం చేస్తున్నామని, జూన్ 2 ఉదయం 120 సెంటర్లలో గంటసేపు పటాకులు కాలుస్తామని టీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.
కేసీఆర్ ప్రయాణించే మార్గాలైన పరేడ్ గ్రౌండ్, రాజ్ భవన్ మార్గాల్లో కేసీఆర్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కేసీఆర్ కు ఘనస్వాగతం పలకనున్నారు. వేడుకలకు హాజరయ్యే సందర్శకులకు ఆహార ప్యాకెట్లు, మంచినీళ్ళు సిద్ధం చేయనున్నారు. నగరం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. 2వ తేదీ ఉదయం నుండి స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో జాతీయ జెండాను, టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ సూచించింది.
అటు గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బల్దియా అధికారులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు భారీ స్థాయిలో హాజరుకానుండటంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరణ, ఫుట్ పాత్ లకు, డివైడర్లకు రంగులు వేయిస్తున్నారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద భారీ వేదికను ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. అన్ని ప్రధాన కూడళ్ళలో చెట్లపై లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో ప్యారడైజ్ నుంచి తయారుచేసిన మినీ బిర్యానీ ప్యాకెట్లు, మంచినీళ్ళు సందర్శకులకు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే కొటేషన్లు హోర్డింగులపై దర్శనమివ్వనున్నాయి.
జూన్ 2న ఉదయం 7.30 గంటలకు కేసీఆర్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారు. అనంతరం రాజ్ భవన్ చేరుకొని 8.15 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత తెలంగాణ భవన్ చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడినుండి నేరుగా పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 10.40 గం.లకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.57 గంటలకు సచివాలయం చేరుకొని సమతా బ్లాక్ లో సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అయితే రాజ్ భవన్ కు అనుమతి పరిమిత సంఖ్యలో ఉండడం వల్ల అభిమానులెవ్వరూ రాజ్ భవన్ కు వచ్చి ఇబ్బంది పడవద్దని, పరేడ్ గ్రౌండ్స్ వద్దకు తరలిరావాలని టీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.