mt_logo

అధికారుల్లో స్ఫూర్తిని నింపుతున్న తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు 

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వ అధికారుల సేవలను గుర్తించి, వారిని తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. కష్టపడి పనిచేస్తున్న అధికారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మిగితా అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఈ చర్య బాగా తోడ్పడనుంది. అంతేకాదు ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు మధ్య సమన్వయాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత పాలనా పరంగా అనేక క్లిష్ట సమస్యలు ఎదుర్కొంది. ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమ పథకాలు ఏక కాలంలో ముందుకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానితో ప్రభుత్వానికి అధికారుల నిరంతర సేవలు సేవలు అవసరం అయ్యాయి.

ఉద్యమ నాయకుడిగా దశాబ్ద కాలం పాటు ప్రజా సమస్యలు అవగతం చేసుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, వాటి పరిష్కారం కోసం అధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం తప్పనిసరి అయింది. దానికి అనుగుణంగా శ్రమిస్తున్న వివిధ విభాగాల్లో అధికారుల కృషిని వివిధ వేదికల మీద సీఎం  కొనియాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన గుర్తింపుతో అధికారులు వ్యవస్థలో మరింత మెరుగయిన పాత్ర పోషించడానికి దోహదం చేసింది. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో సతమతం అయిన తెలంగాణ స్వరాష్ట్రంలో నేడు 24 గంటల నిరంతర విద్యుత్తును అందిస్తోంది అంటే దాని వెనకాల ప్రభుత్వ చిత్తశుద్దితో పాటు, ఉద్యోగుల కృషి, శ్రమ, దాగి ఉన్నాయి. కేవలం ఒక్క విద్యుత్ రంగమే కాదు విద్యా రంగం, వైద్య రంగం, మౌలిక వసతుల కల్పన ఇలా అనేక విభాగాల్లో అధికారుల కృషితో మెరుగయిన ఫలితాలు సాధించగలిగింది ప్రభుత్వం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రామాలను దిగ్విజయంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోగలుగుతుంది అంటే అది ప్రభుత్వానికి, అధికారులకు మధ్య ఉన్న మంచి సమన్వయానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల పేరుతొ ఏర్పాటు చేస్తున్న ఇలాంటి వేదికల మీద సీనియర్ ప్రజాప్రతినిధులు ప్రజా సేవలో తమ తమ అనుభవాలను అధికారులతో పంచుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అంతే కాదు అధికారులు సైతం ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి సందర్భం అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశించినట్లు మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ ను అమలు పరచడానికి కావాల్సిన విధివిధానాలను చర్చకు తీసుకురావడానికి కూడా దోహదంచేస్తాయి. అధికారులకు ప్రజలకు మధ్య, ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య, ప్రజలకు అధికారులకు మధ్య సమన్వయాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజలకు పారదర్శకతో కూడిన మెరుగయిన పాలన అందించడానికి కోసం రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించడం జరిగింది. పాలనా పరంగా జిల్లాల పరిధి తగ్గిపోవడంతో కలెక్టర్లు కేవలం రెండు మూడు రోజుల్లోనే జిల్లా మొత్తం పర్యటించే అవకాశం దొరికింది. దీనితో జిల్లా సమస్యలు పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు రావడానికి జిల్లాల పునర్విభజన తోడ్పడింది. అంతేకాదు ప్రభుత్వం నుండి లభిస్తున్న సహాకారం కలెక్టర్లకు కలిసివచ్చింది. జిల్లాల్లో తక్షణ అవసరాలు తీర్చడానికి క్రూయిషియల్ బ్యాలెన్స్ ఫండ్ పేరుతొ ఒక నిధిని ఏర్పాటు చేసి దాని మీద పూర్తి అధికారాలు కలెక్టర్లకు ఇవ్వడంతో వారు మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం ఏర్పడింది. ఒక ఆరోగ్యకరమయిన పోటీ వాతావరణంలో అన్ని జిల్లా అధికారులు తమ తమ జిల్లా అభివృద్ధికి కృషి చేయడంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవడానికి ఒక ముఖ్య కారణం అయింది.  వివిధ విభాగాల్లో ఇస్తున్నతెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క అధికారి చూపిన చొరవను తెలియజేస్తుంది కాబట్టి, అదే క్రమంలో వారు ప్రదర్శించిన పని తీరును మిగితా అధికారులు స్ఫూర్తిగా తీసుకుంటారు. అధికారుల సేవల పట్ల ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు, వారు చూపిస్తున్న ప్రతిభ మిగితా రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా  నిలుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *