mt_logo

దేశంలో తొలి ఈ వోటింగ్ తెలంగాణాలోనే

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికే స్పేస్‌టెక్‌ పేరుతో విధి విధానాలు సిద్ధం చేసిన ప్రభుత్వం తాజాగా మరో విషయంలోనూ ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అధికారులు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ని ఉపయోగిస్తూ ఎన్నికల వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు .

ఈ వోటింగ్‌ :

ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం బ్యాలెట్ ఓటింగ్‌, ఈవీఎం పద్దతిలో ఓటింగ్‌ జరుగుతోంది. వీటికి తోడు ఉద్యోగస్తులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ పద్దతిలో కూడా ఓట్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ వోటింగ్‌ పద్దతికి డిజైన్‌ చేసి, స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా ఓటు వేసే సరికొత్త యాప్‌ను డెవలప్‌ చేశారు.

కేటీఆర్ సహకారంతో :

భారత ఎన్నికల సంఘం, తెలంగాణ ఐటీ శాఖ, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ ఇందులో భాగస్వామ్యం అవగా ఐఐటీ భిలాయ్‌, ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీలు సాంకేతిక సహాకారం అందించారు. ఈ మేరకు టీసెక్‌ ఈ వోట్‌ (TSEC e-Vote) పేరుతో ఆండ్రాయిడ్‌ యాప్‌ని రూపొందించారు.

పనిచేసేదిలా :

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా మూడు దశలో ఓటర్లను ఈ యాప్‌ ద్వారా గుర్తిస్తారు. ఇందులో ఆధార్‌ కార్డు, లైఫ్‌ సర్టిఫికేట్‌, ఎపిక్‌ డేటాబేస్‌తో ఫోటో గుర్తింపు తదితర ప్రక్రియ ద్వారా దొంగ ఓట్లు పడకుండా ఈ యాప్‌ నిరోధిస్తుంది.

తొలి ఈ వోటింగ్ తెలంగాణాలో :

టీసెక్‌ ఈ వోట్‌ (TSEC e-Vote) యాప్‌ ద్వారా డమ్మీ ఎన్నికల ప్రక్రియను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు అక్టోబరు 8 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రిజిస్టరైన వారి ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తారు. అనంతరం అక్టోబరు 20న తొలి దశ డమ్మీ పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *