తెలంగాణ సంస్కృతి, భాష, యాసలపై తీవ్రమైన దాడి జరిగిందని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో “బంగారు బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణకు నీళ్ళూ, నిధులూ, నియామకాల్లోనే కాకుండా సంస్కృతి, భాష, యాస మీద దాడి జరిగిందన్నారు.
“సీమాంధ్రులు మాట్లాడేదే తెలుగనుకుంటారు. మనం తిట్టుకునే పదాలు ఆంధ్రోళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటరు. ఇక తెలుగు సినిమాల్లో ఐతే జోకర్ గాళ్ళకు మాత్రం తెలంగాణ యాస. అసలు ఉర్దూ పుట్టిందే తెలంగాణలో. “జైలు నుండి ఇద్దరు ఖైదీల పరారీ” అనే పదంలో అన్నీ ఉర్దూ పదాలే. జైలు, ఖైదీ, పరారీ అన్నీ ఉర్దూ పదాలే. బస్సు అనే పదాన్ని తెలుగనుకుంటున్నారు. అట్లనే మజ్జిగను తెలుగనుకుంటున్నారు. అది తమిళ పదం. మనం చల్ల అంటం. తెలంగాణ సంస్కృతిపై దాడి జరగడంతో పండగలకు దూరమైనం. కానీ ఇప్పుడు సంస్కృతి, భాషలపై తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలను అలుపెరగకుండా పాడుతారు. తెలంగాణలో పాటలు చదువు, సంస్కృతితో సంబంధం లేకుండానే వారసత్వంగా వచ్చినయి” అని కేసీఆర్ అన్నరు.
తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనానికి తెలంగాణ జాగృతి ఎంతో పాటు పడుతుంది, బంగారు బతుకమ్మ పండుగ కార్యక్రమానికి కృషి చేస్తున్న తెలంగాణ జాగృతికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.