ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి సీఎం కేసీఆర్ తో పాటు తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన నవ, యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికి తన పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన శుభాశీస్సులు తెలుపుతున్నానని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని విశ్వసిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతూ అద్భుత ఫలితాలు రాబట్టాలని కేసీఆర్ అన్నారు. సంవృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు, ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమయిన అండదండలు, సహాయ, సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు తాను తెలియజేస్తున్నానన్నారు.ఈ సందర్భంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు ఇప్పుడు చేయాల్సింది ఖడ్గచాలనం కాదని, కరచాలనం అని కేసీఆర్ స్పష్టం చేశారు.