mt_logo

సీజనల్ కండీషన్స్ పై సీఎస్ సమీక్ష

ప్రస్తుత వేసవి కాలంతో పాటు, నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. సీజనల్ కండీషన్స్ పై వివిధ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, సోమేష్ కుమార్ ముఖ్యకార్యదర్శులు శాంతి కుమారి, అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, శివశంకర్, నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, ఫైర్ సర్వీసెస్ డిజి గోపికృష్ణ, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ కమీషనర్ నీతు ప్రసాద్, ఇరిగేషన్ ENC మురళీధర్ రావు లతో పాటు IMD, IAF, ప్లానింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ.ఎస్ మాట్లాడుతూ వడగాల్పులు ఇంకా కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవసరమైన సలహాలు మరియు సూచనలు ఇవ్వాలని అన్నారు.

ఐ.ఎం.డి అంచనాల ప్రకారం నైరుతి రుతుపనాలు నేడు అండమాన్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, మన రాష్ట్రంలో జూన్ 10 లేదా 11 న చేరుకునే అవకాశం ఉందని, దీని ప్రకారం శాఖలు సన్నద్ధంగా ఉండాలని సీ.ఎస్ అన్నారు. వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ల ద్వారా ఎప్పటికప్పుడు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. IMD ద్వారా ప్రాంతాల వారిగా వర్షం వచ్చే వివరాలను ఇవ్వాలన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వర్షాకాలం ప్రారంభానికి ముందే తగు చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు, పట్టణాలలో అత్యధిక వర్షపాతం సమయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖల కంట్రోల్ రూమ్ లు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడంతో పాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సీ.ఎస్ అన్నారు.

రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ వర్షపాత వివరాలు రోజువారిగా అందిస్తామని, రైన్ ఫాల్ డాటాను జిల్లాలకు పంపిస్తామని, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమీక్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ వర్షకాల సీజన్ లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామని, మలేరియా, డయేరియా లాంటి వ్యాధుల పై ప్రత్యేక దృష్టి సారించామని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు.

జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్ మాట్లాడతూ వర్షకాల సీజన్ దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి పరిధిలో 195 మొబైల్ టీమ్స్ పనిచేస్తాయని, వర్షకాల సన్నద్ధతపై ఇప్పటికే సంబంధిత శాఖలతో సమావేశాలు నిర్వహించామని, NRSA సహకారంతో ఫ్లడ్ మ్యాప్స్ రూపొందిస్తున్నామని, డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ 24 గంటలు పనిచేస్తాయని అన్నారు. సంబంధిత శాఖల నుండి నోడల్ అధికారులను నియమించారని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు. నాలాల పూడికతీతను జూన్ 6 నాటికి పూర్తి చేస్తామని, ప్లాస్టిక్ వేస్ట్ ను తొలగిస్తున్నామని తెలిపారు. మెట్రోరైల్ మార్గంలో హోర్డింగ్స్ తొలగించామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ జిహెచ్ఎంసితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూన్తున్నామని అన్నారు.

ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కూలిన చెట్ల తొలగింపుకు చర్యలతో పాటు అవసరమైన హెలిప్యాడ్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇరిగేషన్ ENC మురళీధర్ రావు మాట్లాడుతూ గోదావరి నది పరివాహక పరిధిలో ముంపు గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఫ్లడ్ బ్యాంక్స్ ను పటిష్ట పరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే సహకారంతో ట్రాక్ లపై అప్రమత్తంగా ఉంటామన్నారు. NDRF అప్రమత్తంగా ఉందని అవసరమైన బోట్స్, ఎక్విప్మెంట్స్ సిద్దంగా ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *