mt_logo

తెలంగాణ సినిమాను నిర్మించుకుందాం..

-భైరంపల్లి చక్రధర్‌రావు

తెలంగాణ రాష్ట్ర ప్రగతికీ, ప్రజల వినోద వికాసానికి, మన కళాహృదయాన్ని, ఆతిథి మర్యాదలను ప్రపంచానికి చాటడానికి సినిమా రంగం సాధనంగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆకాంక్ష.

తెలుగు సినిమాను 1921లోనే నిర్మించిన ఘనత మనది. అటు తరువాత 1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు, 1940-1950 దశాబ్ధంలో 91 సినిమాల నిర్మాణం జరిగింది. అటుమీదట తెలుగు సినిమా బహుముఖంగా పుంజుకున్నది. ఎందరో కళాకారుల, దర్శకుల ప్రతిభాపాటవాలను అందిపుచ్చుకున్నది. ఏటా వందకు పైగా చిత్రాల నిర్మాణం జరిగింది. ఈ కాలంలో మూడు వందలకు పైగా తెలుగు చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. కానీ వీటి నాణ్యత ఏ పాటిదనే ప్రశ్న తలెత్తుతున్నది. 1954లో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రవేశపెట్టి ఏటా ఉత్తమ చిత్రాలకు, దర్శకులకు ఇతర సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేస్తున్నది.

పొరుగునే ఉన్న కన్నడ, తమిళ, మళయాళీ సినిమాలకు అన్ని విభాగాల్లో అవార్డులు లభిస్తున్నాయి. కానీ తెలుగు భాషలో ఏడాదికి వందల చిత్రాల నిర్మాణం జరుగుతున్నా.. మన సినిమా చరిత్రలో ఒక్క తెలుగు సినిమాకు కానీ, ఒక్క తెలుగు దర్శకుడికి గానీ, నటుడికి గానీ జాతీయ అవార్డు రాకపోవటం ఆలోచించదగ్గ విషయం. అయితే శారద, అర్చన, విజయశాంతిలకు ఉత్తమ నటీమణులుగా అవార్డులు దక్కటం కొంత ఊరట. తమకు సొంత రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న దశ. తెలుగు సినిమా తెలంగాణ సినిమాగా అభివృద్ధి జరగాల్సిన తరుణమిది. ఈ సమయంలో తెలుగు సినిమా కళను పునరుద్ధరింపజేయటం, పునర్నిర్వచించటం, పునరుజ్జీవింపచేయటం అవసరం. అది తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటుతోనే సాధ్యం.

తెలుగు సినిమా దారిలో పడాలంటే, జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఉనికి చాటుకోవాలంటే పకడ్బందీ ప్రణాళిక .. ఆచరణయోగ్యమైన నూతన పద్ధతులూ.. కళాత్మకతను వెలికితీసే దారులూ అవసరం. ఎన్నో సంవత్సరాలుగా నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ అది కళాత్మక చిత్రాలుగానీ.. అసభ్యత లేని జనరంజక సినిమాలను గానీ.. చిల్డ్రన్ సినిమాలను గానీ నిర్మించటం ఆపు చేసింది. నామమాత్రంగా ఉన్న సంస్థ అది. దాన్ని దాని పాటికి వదిలేసి.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనే సంస్థనొకదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వమే బాధ్యతగా..తనవంతుగా కళాత్మకత గల, అసభ్యత లేని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ప్రేమ, త్యాగనిరతులు, మానవ సంబంధాలు, ఉత్తమమైన మానవ భావోద్వేగాలు కలిగిన సినిమాలను నిర్మించాల్సిన అవసరం ఉన్నది.

తద్వారా తెలంగాణ సినిమా నిపుణులనూ.. కళాకారులను పోత్సహిస్తూనే తెలంగాణ సినిమాను జాతీయ, అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు. డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అని తక్కువ బడ్జెట్‌లోనే సాంకేతికపరంగా చూడదగ్గ సినిమాల నిర్మాణం సాధ్యమవుతుంది కనుక కోటి రూపాయల చొప్పున ఏటా నాలుగు సినిమాలను ప్రభుత్వమే నిర్మించాలె. అలాగే ప్రతి ఏటా నాలుగు బాలల చలన చిత్రాలను కూడా తనవంతు కర్తవ్యంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించాలె.

జాతీయస్థాయిలో ప్రజాదరణ, అవార్డులు పొందిన సినిమా రంగ నిపుణులను విజిటింగ్ ఫాకల్టీగా, విద్యా బోధనలో ఆసక్తి ఉన్న ఫిలిం టెక్నాలజీలో పట్టభద్రులైన వాళ్లను బోధకులుగా నియమించి తెలంగాణ సినిమా స్కూల్‌ను తక్షణం ఏర్పాటు చేయాలె. ఈ విధంగా సినిమా మీద ఆసక్తికన్నా కుల ప్రాంత ప్రాతిపదికన సినిమా రంగంలోకి చొరబడి వ్యాపారమే ధ్యేయంగా చౌకబారు సినిమాలు తయారు చేస్తున్న వాళ్లకు కాలం చెల్లేలా చేయవచ్చు. తెలంగాణ సినిమాకు కావలసిన సాంకేతిక నిపుణులనూ, కళాకారులనూ తయారు చేసుకోవచ్చు. ఇందుకుగానూ భారతీయ ప్రభుత్వం నడుపుతున్న పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ పాఠ్యాంశాలను కార్పొరేట్ బోధనతో జోడించి ప్రపంచస్థాయి సినిమా నిపుణులను తయారు చేసుకోవాలె.

రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లను సినిమా పెద్దలు లీజుకు తీసుకొని తమ ఇష్టం వచ్చిన సినిమాలు నడిపిస్తూ చిన్న సినిమా విడుదలకు చోటివ్వని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాను ఆదుకొని ఉత్తమైన చిన్న సినిమా నాలుగు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలె. దానికి గానూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ, మండల కేంద్రంలోనూ కనీసం ఒక థియేటర్‌ను ప్రభుత్వం నిర్మించాలి. లేదా ఇప్పటికే ఉన్న థియేటర్‌ను లీజుకు తీసుకోవాలి. వీటి ద్వారా చిన్న సినిమాల విడుదలకు సహాయం చేయాలె. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయ మార్గమే తప్ప నష్టపోవటం అంటూ ఉండదు.

రాష్ట్రంలోని కనీసం ఒక థియేటర్‌లో పాత సినిమాలు లేదా అంతర్జాతీయ స్థాయిలోని ఉత్తమ సినిమాలు ప్రదర్శించే ఏర్పాటు చేయాలె. ఈ విధంగా ప్రజలకు మంచి సినిమాలు అందే ఏర్పాటు చేయాలె. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభించవచ్చు. ఎంతో మంది సినిమాను టీవీలో కాకుండా నలుగురితో కలిసి థియేటర్‌లో చూడాలనీ, ఆ సినిమా గురించి మాట్లాడాలనీ, ఆ సినిమాకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనీ అనుకుంటున్నారు. అలాంటి సినిమా ప్రియుల కోసం ఆ పాత మధురాలను ప్రదర్శించాలె.

ప్రతి ఏటా తెలంగాణ జాతీయ/అంతర్జాతీయ సినిమా పండుగలను నిర్వ హించాలె. దీనివల్ల జాతీయస్థాయిలోని వివిధ భాషల ఉత్తమ సినిమాలు చూసే అవకాశం మన ప్రజలకు కలుగుతుంది. దేశంలో ప్రతి రాష్ట్రానికీ మన తెలంగాణ రాష్ట్ర ఉనికి, వైభవం తెలియజెప్పవచ్చు. రెండు లేదా మూడేండ్లకు ఒకసారి అంతర్జాతీయ సినిమా పండుగ నిర్వహించి, బహుమతులు ప్రకటించడం వల్ల తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటుంది. పలు దేశాల కళాకారులూ, ప్రతినిధులూ తెలంగాణకు రావడంవల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిచయమూ జరుగుతుంది. నిర్వహణకు అయ్యే ఖర్చులను ఎంట్రీ ఫీజుల రూపంలో తీసుకోవటం వల్ల ప్రభుత్వం కొంత భారాన్ని తగ్గించుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ప్రగతికీ, ప్రజల వినోద వికాసానికి, మన కళా హృదయాన్ని, ఆతిథి మర్యాదలను ప్రపంచానికి చాటడానికి సినిమారంగం సాధనంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆకాంక్ష.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *