mt_logo

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి..

ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం ఆయన నివాసంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆరు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ప్రణాళికాసంఘం స్థానంలో నూతన వ్యవస్థను తీసుకొచ్చే క్రమంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధాని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రులంతా వారి అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఆర్ధిక ఎజెండాను రూపొందించడానికి ప్రధాని అధ్యక్షుడిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై టీం ఇండియా అనే ఆలోచన చేయడం ఆహ్వానించదగిందని, ప్రధాని తీసుకున్న ఈ అపూర్వమైన చొరవను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాలు బలహీనంగా ఉంటే దేశం పటిష్ఠంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న కేసీఆర్ మాటలతో ప్రధాని మోడీ కూడా ఏకీభవించారు.

ప్రస్తుతం ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ఏర్పడబోయే ఈ వ్యవస్థకు నీతి ఆయోగ్ (విధాన సంఘం) పేరు రూపొందించినట్లు, దీనిని వచ్చే సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా నెలకొల్పనున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థలో మూడు లేదా నాలుగు టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేస్తారని, ఇందులో ఒక టాస్క్ ఫోర్స్ కు కన్వీనర్ గా సీఎం కేసీఆర్ ఉంటారని తెలిసింది. ప్లానింగ్ కమిషన్ స్థానంలో వస్తున్న ఈ నూతన వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండాలని, ఇన్నాళ్ళూ ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కేటాయింపులో ఉన్న తారతమ్యాలను పారాదోలేదిగా ఉండాలని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *