mt_logo

వచ్చేనెలలో తెలంగాణ విజయోత్సవ సభలు

మార్చి 2 న తెలంగాణ కాంగ్రెస్, మూడోవారంలో టీఆర్ఎస్ పార్టీలు భారీ విజయోత్సవ సభలు నిర్వహించనున్నాయి. తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రతినిధులు, రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వారందరినీ కలిసి ధన్యవాదాలు తెలపాలని భావిస్తున్నారు. మంత్రి కే. జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నేతృత్వంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ లోని అశోకా హోటల్ లో సమావేశమయ్యారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమని 2009 లో మాట ఇచ్చిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోనే తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించాలని, ఈ సందర్భంగా సోనియాకు, రాహుల్ గాంధీలకు ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయోత్సవ సభను మార్చి 2 న జరపాలని, సోనియాను కలిసి ఆమె ఒప్పుకుంటే సభ ఏర్పాట్లను ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగి అడుగుపెడతానని మాట ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఈనెల 23 న హైదరాబాద్ కు రానున్నారని తెలిసింది. కేసీఆర్ హైదరాబాద్ లో అడుగుపెట్టగానే శంషాబాద్ విమానాశ్రయం నుండి గన్‌పార్క్ వరకు లక్ష మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విజయోత్సవ సభను మార్చి మూడవ వారంలో 50 లక్షలమందితో భారీ విజయోత్సవ సభను నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో ఎక్కడో ఒకచోట సభ నిర్వహిస్తారని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *