mt_logo

ఈ రోజే లోక్‌సభకు తెలంగాణ బిల్లు

ఎలాగైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిచేయాలని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును గురువారమే పార్లమెంటులో ప్రవేశపెట్టేలా నిర్ణయం తీసుకుంది. సొంత పార్టీ ఎంపీలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా వెనక్కు తగ్గకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో ప్రత్యేక విందు ఏర్పాటుచేసి తెలంగాణకు ఆ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపేలా చర్చలు జరిపారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో బిల్లును కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అసెంబ్లీకి పంపిన బిల్లును యథాతథంగా ఉంచి కేబినెట్ సూచించిన సవరణలను జతచేసి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. బుధవారం కేంద్రకేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి వాటిని సీమాంధ్రలో కలపాలని, వాటిలోకూడా ముంపు ప్రమాదం ఉన్న 134 గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలపాలని, ముంపు ప్రమాదం లేని గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. పాల్వంచ, భద్రాచలం డివిజన్ లోని 200 గ్రామాలు తెలంగాణ పరిథిలోకే రానున్నాయి. బుధవారం నాటి సభలో సీమాంధ్ర ఎంపీల దిగజారుడు చర్యలతో మండిపడ్డ లోక్‌సభ కార్యాలయ యంత్రాంగం గురువారం మళ్ళీ ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవకుండా పెద్దసంఖ్యలో మార్షల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్న 25 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *