mt_logo

పార్లమెంటు చరిత్రలోనే తెలంగాణ బిల్లు గొప్పది-టీజేఏసీ

ఏ బిల్లుకు లభించని మెజారిటీ సభ్యుల మద్దతు తెలంగాణ బిల్లుకు లభించగలదని, పార్లమెంటు చరిత్రలోనే తెలంగాణ బిల్లు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. తెలంగాణ ప్రజల కోరిక త్వరలో తీరబోతుందని, 38 పార్టీలకు చెందిన నేతలను కలిసి తెలంగాణ అంశంపై చర్చించి వారి మద్దతు కోరుతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో జేఏసీ నాయకులు సమావేశమై తెలంగాణ అంశంపై చర్చించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందుతుందని జైపాల్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. బీజేపీ నేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితీష్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, బర్ధన్, గురుదాస్ గుప్తా, బీఎస్పీ నేత మాయావతిలను కలిసి తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం గం.6.30 ని.ల.కు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ జేఏసీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని కలిసి గతంలో రాష్ట్రాల ఏర్పాటు విషయంలో అనుసరించిన విధానాన్నే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా పాటించాలని కోరనున్నారు. ప్రొఫెసర్ కోదండరాం తో ఢిల్లీ వెళ్ళిన వారిలో కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, కో చైర్మన్ సీ.విఠల్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *