గురువారం తనను కలిసిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా పలువురు జేఏసీ నేతలతో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ సమావేశమయ్యారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ తెచ్చుకుందామని, బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లులో కొన్ని అంశాలు తెలంగాణకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వాటిని సవరించడంలో సహకరించాలని ప్రొ. కోదండరాం కోరగా దానికి ఆమె సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమపై ఎలాంటి విమర్శలు చేసినా తాము తెలంగాణకు మద్దతు ఇవ్వడంలో వెనక్కు తగ్గేదిలేదని చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు, జగన్ చేస్తున్న ప్రయత్నాలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ తెలంగాణకు మద్దతు ఇస్తాననడం శుభపరిణామమని కోదండరాం ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో తమమధ్య జరిగిన సంభాషణలో బీజేపీ తెలంగాణకు మద్దతు ఇవ్వదని వస్తున్న వ్యాఖ్యలను సుష్మ కొట్టిపడేశారు. చంద్రబాబు బీజేపీ నేతలను అనేకసార్లు కలవడంతో ఇలాంటి విమర్శ వచ్చిందని జేఏసీ నేతలు వివరించగా,మా పొత్తులు ఎవరితో ఉన్నా తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారితోనే ఉంటాయని సుష్మ వారితో అన్నట్లు జేఏసీ నాయకులు వివరించారు. సుష్మాస్వరాజ్‌ను కలిసిన వారిలో జేఏసీ నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.