రాష్ట్రపతి ఇచ్చిన గడువు తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. బుధవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ద్వితీయ స్మారకోపన్యాసంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన తెలంగాణపై మరోసారి ఖచ్చితమైన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో చర్చ జరిగినా, జరగకపోయినా ఒక్కటే అని, పార్లమెంటుకే రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాధికారాలు ఉన్నాయన్నారు. విభజన ప్రక్రియ చివరిదశకు చేరుకుందని, ఎన్నికలకు ముందే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సీమాంధ్ర నేతలు బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా సమయం వృధాచేసినంత మాత్రాన ఏమీ కాదని, రాష్ట్రపతి ఇచ్చిన సమయం ముగియగానే పార్లమెంటు సమావేశాలు ప్రారంభించి బిల్లును ఆమోదిస్తారని ఆజాద్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తప్పనిసరిగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందామన్నారు.