గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రాంత ప్రజలను, సంస్కృతిని, ఉద్యమాన్ని చులకనచేస్తూ సినిమాలు తీస్తూ వస్తోంది. దీనిపై తెలంగాణ ప్రజలు అనేక విధాలుగా తమ నిరసన వెలిబుచ్చారు. అయితే ఈ సారి ఆ ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పట్టరాని ఆగ్రహానికి పవన్ సినిమా తెలంగాణలో నడవలేని పరిస్థితి వచ్చింది. దీనికి తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణపై చూపిస్తున్న వివక్ష ఒక కారణం కాగా దీనికి మరో ప్రధాన కారణం అటు చిరంజీవి, ఇటు పవన్ కల్యాణ్ తెలంగాణకు చేసిన వ్యక్తిగత ద్రోహం.
మూడున్నరేళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు పలికాడు. జగిత్యాల రోడ్ షోలో చాలా ఉద్వేగంగా ప్రసంగిస్తూ (నటిస్తూ?) తెలంగాణ ఉద్యమానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని నమ్మబలికాడు.
అన్న బాటలోనే తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ రాష్ట సాధన ఉద్యమానికి మద్ధతిచ్చాడు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఒక సభ పెట్టి అక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు.
కరీం నగర్లో జరిగిన ఒక సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణపై తమకున్నంత చిత్తశుద్ధి మరెవరికీ లేదన్నాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. పైకేదో సామాజిక స్పృహ, గాడిదగుడ్డు అని ఫోజులు కొట్టే ఈ హీరో ఎంత ఘోరంగా తెలంగాణ ప్రజలను వంచించాడో.
ఆ రోజుల్లో తెలంగాణలో లక్షలాది మంది అభిమానులు ఈ అన్న, తమ్ముళ్ల మాటలు నమ్మారు. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే అటు అన్న, ఇటు తమ్ముడు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించారు.
చిరంజీవి బూటకపు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకోగా, తమ్ముడు పవన్ అప్పటి నుండి ఈ విషయంపై మాట్లాడమే మానేశాడు.
అట్లాంటి మనిషి ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఉద్యమాన్నే టార్గెట్ చేస్తూ సినిమా తీసేసరికి ఇక్కడి ప్రజలకు గుండె మండింది. నమ్మించి తమ గొంతుకోసినందుకే పవన్ కల్యాణ్ తాజా సినిమాపై తెలంగాణ ప్రజల ఆగ్రహం రెట్టింపైంది.
వివాదం తరువాత సినిమాలో దాదాపు 15 సీన్లను కత్తెర వేయాల్సి వచ్చిందంటే ఒకసారి ఊహించుకోండి పవన్, పూరి జగన్నాధ్ ఈ సినిమాను ఎంత నిర్ల్యక్షంగా తీశారో.