mt_logo

ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ

తెలంగాణ దేశానికే ఇన్నోవేషన్ హబ్‌గా, స్టార్టప్‌లకు క్యాపిటల్‌గా మారిందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. టీ-హబ్‌కు చెందిన నాలుగు స్టార్టప్‌లు ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం తెలంగాణకే గర్వకారణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం లాంటి ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని ఇతర పట్టణాల కంటే ఇక్కడ వాణిజ్య భవనాల అద్దెలు 33 శాతం తక్కువగా ఉన్నాయని వివరించారు. ఖాయిలా పరిశ్రమలను తెరిపించడానికి ఇండస్ట్రియల్‌ హెల్త్‌క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్టు తెలియజేసారు. డిజిటల్‌ తెలంగాణ లక్ష్యాన్ని టీ ఫైబర్‌ నెరవేర్చుతుందని చెప్పారు. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 83.58 లక్షల జనాభాకు ఇంటర్నెట్‌ సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. సీఐఐ మాజీ అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ.. ఈవోడీబీలో కొత్త పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఇక్కడున్న సంస్థల విస్తరణను కూడా చేర్చాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్తు సమస్య తీరిందని, కరోనా కాలంలోనూ అనేక కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరణ చేపట్టాయని వివరించారు. సీఐఐ సదరన్‌ రీజియన్‌ మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 2030 నాటికి 120 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్‌ రంగానికి అద్భుత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు బాగున్నాయని, సానుకూల వాతావరణం ఉన్నదని, ప్రతిభావంతులైన విద్యార్థులు అందుబాటులో ఉన్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *