ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటేసేందుకు టీడీపీ నీచ రాజకీయాలకు ఒడిగట్టింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. ఐదు కోట్లు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పథకంలో భాగంగా ఆదివారం సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అయితే రేవంత్‌రెడ్డితో పాటు బీజేవైఎం రాష్ట్ర నేత ఉదయ్‌సింహ, మధ్యవర్తి సెబాస్టియన్ బారీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో సోమవారం ఉదయం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగాడు. రేవంత్ ఉద్దేశాన్ని గమనించిన స్టీఫెన్‌సన్ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో రెండు రోజులుగా రేవంత్‌రెడ్డి కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. చివరకు ఆదివారం సాయంత్రం లాలాగూడ విజయపురి కాలనీలో పుష్పా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న స్టీఫెన్‌సన్ ఇంటికి బీజేవైఎం రాష్ట్ర నేత ఉదయ్‌సింహ, మధ్యవర్తి సెబాస్తియన్‌తో కలిసి రేవంత్‌రెడ్డి చేరుకుని కాసేపు మాట్లాడిన తర్వాత లంచంగా రూ. 50 లక్షలను ఇవ్వబోయే సమయంలో అక్కడే మఫ్టీలో ఉన్న ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న సాక్ష్యులను మూడుగంటలపాటు విచారించి అన్ని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మాట్లాడుతూ, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం స్టీఫెన్‌సన్‌కు లంచం ఇస్తుండగా తమ సిబ్బంది రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారని, రేవంత్‌రెడ్డి యత్నాలపై ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తమకు రెండురోజులక్రితం ఫిర్యాదు చేశారని, తమకు వచ్చిన ఫిర్యాదులో ఒకటి రూ. 5 కోట్ల డీల్, రెండోది రూ. 2 కోట్ల డీల్ అని మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి విజువల్ ఆడియో లభ్యమైందని, నలుగురిపై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఏకే ఖాన్ చెప్పారు.