mt_logo

టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎంపిక

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఎన్నుకున్నట్లు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి ఎం రాజిరెడ్డి ప్రకటించారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లకు చెందిన కార్మికులందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో కేంద్ర నాయకత్వం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. కవితను ఎన్నుకున్న విషయం సింగరేణి సీఎండీ, డైరెక్టర్లకు తెలియజేస్తామని చెప్పారు.

శుక్రవారం తెలంగాణ భవన్ లో సమావేశమైన టీబీజీకేఎస్ సంఘ అధ్యక్షుడు ఏ కనకరాజు, మేడిపల్లి సంపత్, శంకర్ నాయక్ తదితరులు ఎంపీ కవితను కలిసి శుభాకాంక్షలు అందజేసిన తర్వాత మీడియాకు అన్ని వివరాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ముందుండి పోరాటం చేశారని, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిస్తామని, ముఖ్యమంత్రి సహాయనిధికి కార్మికులందరితో చర్చించి ఒక్కరోజు వేతనాన్ని ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

కొత్త బావుల తవ్వకాలకు కావాల్సిన అనుమతుల కోసం పార్లమెంటులో కవిత మాట్లాడుతారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. బొగ్గుబావుల్లోకి వెళ్లి బొగ్గును తవ్వడానికి శ్రమిస్తున్న కార్మికులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని, సకల జనుల సమ్మె కాలంలో వివిధ కారణాలతో సస్పెండ్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని వారు కోరారు. సింగరేణి కార్మికుల హక్కులకోసం, ఉద్యోగుల భవిష్యత్తు కోసం సహాయ సహకారాలు అందిస్తామని, కార్మికులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని కవిత చెప్పినట్లు రాజిరెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *