mt_logo

శాస్త్రం తెలియని ఆర్థిక పండితుడు!

By: టంకశాల అశోక్

హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేవటం ఎన్టీఆర్ నేర్పారని, అంతకు ముందు వారు పొద్దునే లేచేవారు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యపడదగింది లేదు. ఆయనతో పాటు ఆయనవంటి వైఖరే గల అనేకులు తెలంగాణ ప్రజల గురించి ఈ విధంగా మాట్లాడటం కొత్తకాదు. సీమాంధ్ర పాలన తమకు వద్దని తెలంగాణవాసులు పట్టుదలతో ఉద్యమించటానికి గల ప్రధాన కారణాలలో ఈ దురహంకార వైఖరి ఒకటన్నది తెలిసిందే. కనుక, యథాతథంగా ఈ వైఖరి కొత్తకాదు, ఆశ్చర్యకరమూ కాదు. వాస్తవానికి వారు ఇంతకుమించిన అవమానకరమైన మాటలు అనేకం అన్నారు. రాష్ట్రం విడిపోయిన ఏడాది తర్వాతకూడా బాబు ఇదేమాట మళ్లీ అనటమెందుకన్నది ఒక్కటే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. ఆ విధంగా పైకి ఒకసారి ఉండబట్టలేక అంటున్నారంటే మనసులో ఎంతున్నట్లు? తమలో తాము మాట్లాడుకుంటున్న సమయాల్లో ఇంకా ఏమేమి అంటుండవచ్చు?

ఈ వైఖరిలో అహంకారం ఉందన్నది కనిపిస్తున్నదే. కానీ నిజంగా అర్థం చేసుకోవలసింది. అటువంటి అహంకారం వెనుకగల అజ్ఞానాన్ని. హైదరాబాద్ ప్రజలు ఉదయమే నిద్రలేచేవారా? కాదా? తెలంగాణ రైతులకు వ్యవసాయం రానపుడు వారే వచ్చి నేర్పారా? ఇక్కడి ప్రజలకు వంటలు, పిండి వంటలు, పచ్చళ్లు, పాడి, బట్టకట్టు అక్కడి వారు వచ్చిన తర్వాతనే తెలిశాయా? వారి వలసలు, వలసాధిపత్యాలపై భావంతోనే తెలంగాణ అనాగరిక జాతి ఒకమేరకు నాగరికత నేర్చుకున్నదా? వీటన్నింటినికీ సమాధానాలు చెప్పటం కష్టం కాదు. అవి కనీసపు చదువులు చదివిన సీమాంధ్రులకు కూడా తెలిసినవే. అసలు అంటే ఏమిటి, ఎవరి దృష్టి నుంచి ఏమిటనే ప్రశ్నల జోలికి ప్రస్తుతం వెళ్లటంలేదు. వాటినట్లుంచి కూడా చిన్నచిన్న ప్రశ్నలు కొన్నున్నాయి. తెలంగాణ విషయమై వారికి సమాధానాలు ఏమిటో, పైన అన్నట్లు, కనీసపు చదువులు చదువుకున్న సీమాంధ్రులకూ తెలుసు.
కానీ ఒక షరతు ఉంది. వారికి అహంకారాలు ఉండకూడదు. ధనసంపదలు, రాజ్యాధికారాలు మనుషుల కళ్లకు పొరను కప్పుతాయి.

మెదళ్లకు గల ఆలోచనాశక్తిని క్షీణింపజేస్తాయి. ఆ స్థితిలో ఒకవైపు తమ అలవాట్లు, సంస్కృతి, భావజాలాలు మాత్రమే గొప్పవనే అతిశయం పెరుగుతుంది. ఎదుటివారికి సంబంధించిన వాస్తవాలు కళ్లకు కనిపించనైనా కన్పించవు. పొరలు కప్పుకుపోయిన తమ కళ్లతో, బుద్ధితో ఆ వాస్తవాలను కావాలని విస్మరిస్తారు, లేదా వక్రీకరిస్తారు. అటువంటి విస్మరణలు, వక్రీకరణలు స్వీయ ఆధిపత్యాన్ని నెరపుకొనే తంత్రంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అనుసరించే వ్యూహం. స్థానిక ఆధిపత్యాల నుంచి సామ్రాజ్యవాద ఆధిపత్యాల వరకు చరిత్ర అంతటా కన్పించేదే ఇది. అటువంటి వర్గాలకు మాత్రమే గాక, ఆ ప్రాంతాలకు చెందిన వారికి కూడా ఈ భావధోరణి రక్తంలో జీర్ణించుకుని అంతర్గతమైపోతుంది. గమనించదగినదేమంటే ఇందుకు తరచు కమ్యూనిజం వంటి సిద్ధాంతాలు సైతం మినహాయింపుల నివ్వవు. చంద్రబాబు సరేసరి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అనేకులు కమ్యూనిస్టులకు సైతం తెలంగాణ పట్ల అక్క డి ప్రజల పట్ల ఇదే విధమైన అజ్ఞానంతో కూడిన అహంకారపు భావం ఉండటం నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఇదొక భావజాలం. అది చంద్రబాబు చదివిన ఆర్థికశాస్త్రపు తప్పుకాదు, కమ్యూనిస్టులు బట్టీపట్టిన మార్క్సిజపు లోపం కాదు. అది అచ్చంగా స్వీయ ప్రయోజనాలను మూలం చేసుకుంటూ రూపుదిద్దుకునే ఆధిపత్య భావజాలం.

ఇందులో విచారకరం ఒకటున్నది. అది, ఈ విధమైన అశాస్త్రీయ, అసత్య భావజాల ప్రభావాలు సీమాంధ్ర సామాన్యులపై కూడా ఉండటం అది వారి తప్పుకాదు. పరిస్థితులు, వాతావరణపు ప్రోద్బలం, అక్కడి ఆధిపత్య వర్గాలు సృష్టించి ప్రచారం చేసే భావజాలపు ప్రభావంతో వారికి కూడా అదే దృష్టి ఏర్పడుతుంది. ఇవన్నీ సాధారణ సూత్రీకరణలో, ఊహాగానాలో కావు. తెలంగాణ వాళ్లకు ఏమీ తెలియని, తాము వచ్చి అంతా నేర్పామని వారు మాట్లాడటం అందరికి తెలిసిందే. చంద్రబాబు వంటివారిది ఆధిపత్య ధోరణితో కూడిన అజ్ఞానం, అహంకారం కూడా వీరికి అవే భావజాలాలు వైఫల్యాల పెర్కొలేట్ అయిన అమాయకత్వం.

చంద్రబాబు ఆర్థికశాస్త్రం చదివి డిగ్రీ అయితే తీసుకున్నారు గాని ఆ సబ్జెక్టును డబ్బు-డబ్బు-డబ్బు అనే కోణం నుంచి మాత్రమే చూశారన్నది స్పష్టం. ఆయన దానికొక శాస్త్రంగా అర్థం ఉంటే ఇటువంటి వ్యాఖ్యలను ఒక ప్రాంత ప్రజల రద్దు ఒక ప్రాంత ప్రజలనుద్దేశించి చేసేవారు కాదు. మనిషి ఎక్కడివాడైనా సరే జీవితపు సంఘర్షణలలో భాగంగా కష్టపడతాడు. ఆ కష్టం ఫలితాన్నిస్తుంది, ఎంతటి ఫలితాన్నిస్తుంది, ఆ ఫలితం ఏయే రూపాలు తీసుకుంటుందనేది ఆర్థికశాస్త్రం బాగానే చెప్పింది. రైతు పొద్దు పొడవక ముందే లేచి పొలానికి పోయి వళ్లు విరుచుకోవటం తెలంగాణ, సీమాంధ్ర అనే తేడా లేకుండా ఎక్కడైనా ఉన్నదే. శ్రమించటం అన్నంతవరకు ఎవరిలోనూ లోపం లేదు. కానీ ఆశ్రమ, పైన అనుకున్నట్లు, ఏ ఫలితాన్ని ఏ మేరకు ఇచ్చి, ఏ రూపాలు తీసుకుంటుందో శాస్త్రం చెప్పటమే కాదు, కళ్ల ఎదుట కూడా కన్పించే విషయమే. అర్థశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న చంద్రబాబు ఒకసారి కోస్తా జిల్లాలు, అదే కోస్తాలోని మెట్టప్రాంతాలు, రాయలసీమ గురించి గత 150 సంవత్సరాల ఆర్థిక చరిత్రను చదివితే ఇది బోధపడుతుంది. అట్లా బోధపరుచుకున్న మనిషి ఎవరూ, ఒక మామూలు మనిషివలె ఆలోచించినట్లయితే, రాయలసీమ రైతును, ఒక మామూలు మనిషివలె ఆలోచించినట్లయితే, రాయలసీమ రైతును, తెలంగాణ రైతును తక్కువచేసి మాట్లాడడు. కోస్తాంధ్ర ధనికవర్గాలు, రాజకీయ ఆధిపత్య వర్గాలు, అవే ఆలోచనలుగల అక్కడి బౌద్ధిక వర్గాలకు తెలంగాణ మాట అట్లుంచి రాయలసీమ రైతుపట్ల, ప్రజల పట్ల, సంస్కృతిపట్ల, జీవనశైలి పట్ల గల చిన్నచూపు తెలియనిదెవరికి?

కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగిన తర్వాత 19వ శతాబ్దపు చివరి పాదంలో సైతం కోసాతలో, సీమలో కరువు కాటకాలు, వేలాది ఆకలిచావులు సంభవించటానికి కారణం అక్కడి రైతులు పొద్దునే నిద్రలేవకపోవటమా? వారు కష్టించి పనిచేయకనా? వారికి వ్యవసాయం తెలియకనా? ఈ రోజుకు కూడా సీమ ప్రజలకు, ఉత్తరాంధ్రలకు కోస్తా ఆధిపత్య వర్గాల పట్ల ఎంతమాత్రం ప్రేమ లేనిది ఎందుకు? విషయం ఏమంటే, ఎవరైనా నిద్రలేవటం లేవకపోవటం అనేది అసలు ఉండనే ఉండదు. అన్నింటిని నియంత్రించేది ఆ మనుషులు చేసే పని మాత్రమే. రైతులు, కూలీలు, పనులు చేసుకునేవారు, వేరే ఊర్లకు పోయి కష్టపడేవారు, చివరకు ఇళ్లలో ఆడవారు కూడా కోస్తాలోనైనా, తెలంగాణలోనైనా వేకువజాము లేస్తారు. పొద్దుపొడిచి పోయిన తర్వాత లేచే తరగతులు అంతటా ఉంటాయి. ఏ రైతు ఎంత శ్రమపడినా నీరున్నచోట, తగిన పెట్టుబడి, టెక్నాలజీ ఉన్నచోట వచ్చే ఫలితానికి, లేనిచోట తగిన ఫలితానికి తేడా ఉంటుంది. ఫలితంలో తేడాకు అర్థం శ్రమలో తేడా ఉండటం కాదు. ఆ ఫలితాన్ని కాజేసినవారు ధనికులై, రాజకీయ ఆధిపత్యాన్ని చేజిక్కించుకుని, ఉత్తరాంధ్ర, రాయల సీమ, తెలంగాణలపై రాజ్యం సాగిస్తే అందుకు కారణం అక్కడి రైతులు పొద్దెక్కి లేవటం, కష్టపడకపోవటం కాదు.

ఆర్థిక శాస్త్రాన్ని టెక్ట్స్ పుస్తకాలకు పరిమితం చేసి, డబ్బు-అధికారం కోసం చదవటం గాక, ఆ శాస్త్రానికి సమాజంతో, సామాజిక శాస్త్రంతో మానవ వికాస శాస్త్రంతో సంబంధం ఉంటుందని గ్రహిస్తే చంద్రబాబు వంటి వారికి విషయాలు సక్రమంగా అర్థమవుతాయి. అప్పుడు అహంభావానికి అవకాశముండదు. చరిత్రలో కోస్తారైతు మాత్రమే అక్కడి ప్రాజెక్టులు లేకపోయినా కష్టపడి, ఏ టెక్నాలజీ లేకున్నా బాగా పండించి మార్కెట్లు లేకున్నా బాగా సంపాదించి, అంతటా పెట్టుబడులు పెట్టి, ఆధిపత్య స్థితి సృష్టించి, చంద్రబాబు వంటివారికి అధికారమివ్వలేదు. ఆర్థిక పరిణామక్రమాలు, దానినిబట్టి రాజకీయ పరిణామక్రమాలు ఏ విధంగా ఉంటాయి, సామాజిక సాంస్కృతిక పరిణామక్రమాలు అందుకు సమాంతరంగా ఎట్లా సాగుతుంటాయనేది అంతా కూడా ఆర్థిక శాస్త్రంతో నిమిత్తం కలదే. చరిత్ర పొడవునా అంతటా ఉన్న ఈ వాస్తవాలను ఎవరూ ఎవరికీ కొత్తగా చెప్పనక్కరలేదు. కానీ ఆధిపత్య భావజాలంతో, అహంకారంతో వివేచన, విచక్షణ నశించిన చంద్రబాబు వంటి తరగతికి మాత్రం చెప్పవలసిన అవసరం చాలా ఉంది.

ఎన్టీఆర్ రాకముందు హైదరాబాద్ జీవితాలు, శ్రమలు, కార్యకలాపాలు ఏ విధంగా ఉండేవో ఇప్పటికే పలువురు రాసినందున అందులోనికి పోనక్కరలేదు. అదేమీ చంద్రబాబుకు గాని, తనకు చెప్పినవారికి గాని తెలియదన్నది మాత్రం స్పష్టం. అయితే పైన అనుకున్నట్లు, ఆధిపత్య ధోరణులతో విచక్షణలు నశించినవారికి వాస్తవాలతో నిమిత్తం ఉండకపోవటం ఒక సహజ లక్షణం. తెలిసినా వాటిని బుద్ధిపూర్వకంగా విస్మరించాలి, వక్రీకరించాలి. లేనట్లయితే ఆధిపత్యానికి అవసరమైన అసత్యాలను, భావజాలాన్ని సృష్టించి ప్రచారం చేయలేరు. ఆధిపత్య సంస్కృతికి అసత్యాల సంస్కృతి ఒక స్తంభంగా పనిచేయటం తెలిసిందే.

రాష్ట్రం విడిపోవటం కూడా జరిగిన తర్వాత, చంద్రబాబు వంటి వ్యక్తి ఇంకా ఈ విధంగా మాట్లాడటం ఆయన మెదడు పొరల్లో ఎటువంటి కల్మషం, కుహకం, తెలంగాణ పట్ల వ్యతిరేకత పేరుకుపోయి ఉన్నాయో అర్థమవుతుంది. అటువంటి వ్యక్తికి ఏ శాస్త్రాలూ బోధపడే అవకాశం లేదు. శాస్త్రాలు యాంత్రికమైనవి కావు, సామాజిక వాస్తవాలతో ముడిబడిన సజీవమైనవి. ఆధిపత్య వాదులు లోపల ఏమున్నా కనీసం పైకి నటనలు చేస్తారు. అట్లా నటనలు చేసే కపటం లేకుండా తన నిజస్వరూపాన్ని తరచూ బయటపెట్టుకుంటున్నందుకు మాత్రం బాబును అభినందించాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *