ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి చంద్రబాబు తెచ్చిందేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ జరగనున్న సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజిగిరి నియోజకవర్గాల లోక్ సభ ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవేక్షిస్తున్నారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్ధులకు చంద్రబాబు డబ్బులు పంపాడు. చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నాడు. నిద్రలో కూడా బాబు సీఎం కేసీఆర్ నే కలవరిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లో తామంతా సంతోషంగా ఉన్నామని ఇక్కడున్న ఆంధ్రా ప్రజలే చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం మరో 15 కిలోమీటర్లు విస్తరించే అవకాశం ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం. హైదరాబాద్ పై కేటీఆర్ కు మంచి విజన్ ఉందని తలసాని పేర్కొన్నారు.