స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనే నినాదంతో 1952లో ముల్కీ ఉద్యమం చేసి అమరులైన యువకుల స్మృత్యర్ధం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ జేయేసీ నిర్ణయించింది.
సెప్టెంబర్ 7 నాడు నగరంలోని సిటీ కాలేజ్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టీజేయేసీ విస్తృత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రజలు ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నా సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడంపై జేయేసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి, డీజీపీ సహకారంతోనే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని జేయేసీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 7 నాడే సీమాంధ్ర ఉద్యోగులు నగరంలో సభ పెడతామని ప్రకటించడం, తెలంగాణ జేయేసీ అదే రోజు ర్యాలీ తలపెట్టడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిష్పాక్షికతకు పరీక్ష జరగనుంది.
ఈ రెండిటికి అనుమతి ఇస్తారా, లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.