తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన బిల్లును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టగానే అన్ని పక్షాల సభ్యుల హర్షధ్వానాల మధ్య శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు సీఎం మాట్లాడుతూ, ఐటీ రంగంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని, నిజాం కాలం నుండే తెలంగాణ పరిశ్రమలకు ప్రసిద్ధి అని గుర్తు చేశారు. పరిశ్రమలను ఆకర్షించాలంటే సరైన విధివిధానాలు ఖరారు చేయాలని, ముఖ్యంగా పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే విద్యుత్, భూమి, నీరు కావాలని సీఎం పేర్కొన్నారు.
అంతర్జాతీయ కంపెనీలన్నీ హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయని, హైదరాబాద్ కు కాస్మోపాలిటన్ కల్చర్ ఉందన్నారు. పరిశ్రమల కోసం 30 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉందని, 2.5 నుండి 2.75 లక్షల ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందని, ప్రాజెక్టులనుండి పది శాతం నీటిని పరిశ్రమలకు కేటాయిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేశామని, దేశీయ పారిశ్రామిక సంస్థలు ఫిక్కీ, డిక్కీ, సీఐఐ తదితర సంస్థలతో విస్తృత చర్చలు జరిపి తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా, తెలంగాణ వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును తయారు చేశామని కేసీఆర్ చెప్పారు.