తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉండరాదని,బిల్లుపై తీర్మానం ప్రవేశపెట్టవద్దని కోరుతూ అన్ని పార్టీల తెలంగాణ నేతలు ఈ రోజు స్పీకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసారు. స్పీకర్‌ను కలిసిన వారిలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, గీతా రెడ్డి, సారయ్య,సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగాలని అన్నారు. సీఎం కిరణ్ ఇచ్చిన నోటీస్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని స్పీకర్‌ను కోరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీఎం కిరణ్ కలిసి బిల్లును అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. అందుకే సభలో చంద్రబాబు మాట్లాడకుండా ఉండడానికే రూల్ 77 తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై చర్చను రేపు సాయంత్రానికల్లా ముగించి రాష్ట్రపతికి పంపించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కూడా సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా విమర్శించారు.