ఈ రోజు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు ఢిల్లీ వెళ్ళగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మంగళవారం వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లే వరకు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి ఉదయమే ఢిల్లీ చేరారు. తెలంగాణ బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, కాంగ్రెస్ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరినప్పుడు సీఎం కిరణ్, సీమాంధ్ర నేతలు ప్రవర్తించిన తీరును అధిష్ఠానానికి వివరించే ప్రయత్నం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సీఎం బిల్లును వెనక్కు పంపాలని ఇచ్చిన నోటీస్ పై తీర్మానం సభలో తీవ్ర గందరగోళానికి గురిచేసిన విధానం కూడా ఈ సందర్భంగా వివరించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, జీవోఎం సభ్యులు, దిగ్విజయ్ సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లను కలవడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అప్పాయింట్ మెంట్ కోరారు.